
ధార్వాడ, జనవరి 22: కనిపించకుండా పోయిన పారామెడికల్ విద్యార్థిని ఊహించని విధంగా శవమై కనిపించింది. మృతురాలిని జాకియా ముల్లా (19) అనే పారా మెడికల్ విద్యార్థినిగా గుర్తించారు. ధార్వాడ గాంధీ చౌక్ లేఔట్లో చెందిన ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఈ దారుణం వెలుగు చూసింది. నగర శివార్లలోని మన్సూర్ రోడ్డులోని వినయ్ డెయిరీ సమీపంలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో జాకియా ముల్లా మృతదేహం ముక్కలై కనిపించింది. మరో చోట హత్య చేసి, ముక్కలు చేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
జాకియా ముల్లా ధార్వాడ్‌లోని గాంధీ చౌక్ నివాసి. ఇటీవలే తన పారామెడికల్ చదువును పూర్తి చేసి, ఉద్యోగం కోసం వెతుకుతోంది. జనవరి 20వ తేదీ సాయంత్రం, జాకియా ల్యాబ్‌కు వెళ్తున్నానని చెప్పి తన ఇంటి నుండి బయలుదేరింది. రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుటుంబం అంతా కలిసి భోజనం చేశామని, ఆ తర్వాత జాకియా బయటకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదని ఇమె తండ్రి యూనస్ ముల్లా కన్నీటి పర్యాంతమయ్యాడు. మరుసటి రోజు ఉదయం, విద్యాగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూర్ రోడ్డులోని వినయ్ కులకర్ణి డెయిరీ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో జకియా మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు నులిమి చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
అయితే ఈ హత్య చేసిన నిందితుడు సబీర్ ముల్లా మృతదేహం దొరికిన ప్రదేశానికి సమీపంలోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. జకియాతో సబీర్‌కు వివాహం నిశ్చయమైందని, వారికి నిశ్చితార్ధం జరగలేదని, తమ మధ్య గొడవ కారణంగా ఆమెను హత్య చేశానని నిందితుడు తెలిపాడు. అయితే తొలుత హత్య గురించి ఏమీ తెలియనట్లు స్వయంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి మృతదేహం వివరాలు తెలియజేశాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు కూడా సబీర్ సంఘటన స్థలంలోనే ఉన్నాడు. అయితే తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు నేరం గురించి తనకు ఏమీ తెలియనట్లుగా వ్యవహరించాడు. అధికారులు అతని అసాధారణ ప్రవర్తన గమనించి తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. సబీర్ ముల్లా ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. జనవరి 20 సాయంత్రం జాకియా, సబీర్ కలిసి బయటకు వెళ్లారు. అయితే వీరి వివాహం గురించి వారి మధ్య వాదన చెలరేగింది. గొడవ తీవ్రమవడంతో సబీర్ నియంత్రణ కోల్పోయి జాకియాను ఆమె ధరించిన బురఖాతో గొంతు నులిమి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు చేసి నిర్మానుష్య ప్రదేశంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సబీర్ ముల్లాకు మరెవరైనా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత జాకియా మృతదేహాన్ని పోలీసు అధికారుల సమక్షంలో ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.