సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!

ఇటీవల సీబీఎస్సీ విద్యార్ధులకు జారీ చేసిన స్కాన్డ్ సమాధాన పత్రాలు బ్లర్‌గా, అస్పష్టంగా రావడంతో OSM పారదర్శకతపై వివాదం రాజుకుంది. దీంతో పెద్ద ఎత్తున విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు నుంచి ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సీబీఎస్సీ వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేశారు..

సీబీఎస్సీ OSMపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన.. రంగంలోకి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌!
Minister Dharmendra Pradhan On Cbse Evaluation Issue

Updated on: May 24, 2026 | 8:12 AM

న్యూఢిల్లీ, మే 24: సీబీఎస్ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పునఃమూల్యాంకన ప్రక్రియలో తలెత్తి సాంకేతిక అంతరాయాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా పరిగణించారు. సర్వర్ డౌన్‌టైమ్, పేమెంట్ గేట్‌వే లోపాలు, కార్యాచరణ వైఫల్యాలపై సవివరమైన నివేదికను కోరుతూ సీబీఎస్సీకి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక వైఫల్యాలకు గల కారణాలు, తీసుకున్న సన్నద్ధతా చర్యలతోసహా ఈ ప్రక్రియ నిర్వహణలో పాలుపంచుకున్న ఏజెన్సీల జవాబుదారీతనంపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానం కింద 98.6 లక్షలకు పైగా జవాబు పత్రాలను సీబీఎస్సీ మూల్యాంకనం చేసింది. విద్యార్ధులకు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను పొందే అవకాశం కూడా కల్పించింది. అయితే విద్యార్ధులకు జారీ చేసిన స్కాన్డ్ సమాధాన పత్రాలు బ్లర్‌గా రావడంతో వివాదం రాజుకుంది. సీబీఎస్సీ నిర్దేశిత విధానం ప్రకారమే ధృవీకరణ, పునఃమూల్యాంకనం జరిగిందని బోర్డు తెలిపినప్పటికీ రీవాల్యుయేషన్‌కు భారీగా దరఖాస్తులు రావడంతో తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో అధిక రద్దీ కారణంగా పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు, చెల్లింపు నిర్ధారణలో జాప్యం నెలకొంది. అంతేకాకుండా స్కాన్ చేసిన కాపీలో ఏమాత్రం స్పష్టంలేని పేజీలను చూసి విద్యార్ధులు ఖంగు తిన్నారు. తప్పుగా గుర్తించిన సమాధానాలతో సహా మూల్యాంకనానికి సంబంధించిన సందేహాల నివృతికి విద్యార్థుల నుంచి బోర్డుకు ఫిర్యాదులు వచ్చాయి.

దీనిపై స్పందించిన బోర్డు అన్ని సమస్యలను తాము పర్యవేక్షిస్తున్నామని, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. తల్లిదండ్రులు, విద్యార్థులు ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నట్లయితే ఆందోళన చెందవద్దని తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అధిక ట్రాఫిక్ కారణంగా పోర్టల్‌లో కొన్ని సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన సవరణ చర్యలు తీసుకున్నామని బోర్డు వివరించింది. ఈ క్రమంలో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు సమర్పించే గడువును మే 24 వరకు పొడిగించినట్లు సీబీఎస్ఈ తెలిపింది. జవాబు పత్రాల చివరి స్కాన్ చేసిన కాపీని పొందేందుకు, పునఃమూల్యాంకన అభ్యర్థనలను స్వీకరించేందుకు పోర్టల్ మరో రెండు రోజుల పాటు తెరిచి ఉంటుందని కూడా బోర్డు ప్రకటించింది.

ఈ ఏడాది సీబీఎస్సీ కొత్తగా తీసుకువచ్చిన OSM వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో బోర్డు ఫీజు విధానాన్ని కూడా సవరించింది. విద్యార్థులు కేవలం రూ.100 చెల్లించి తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను పొందవచ్చని తెలిపింది. ఇది ఇప్పటి వరకు ఫీజు రూ. 700గా ఉంది. జవాబు పత్రాల ధృవీకరణ రుసుమును సైతం రూ. 500 నుంచి రూ. 100కు తగ్గించింది. ఇక పునఃమూల్యాంకన రుసుమును ప్రతి ప్రశ్నకు రూ. 25గా నిర్ణయించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us