దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రోజురోజుకీ వ్యాప్తి వేగవంతమవుతోంది. గత వారం రోజుల్లోనే 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 348 కి చేరింది. అందులోనూ.. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని వెస్ట్, సౌత్, నజఫ్‌గఢ్ జోన్లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదేళ్లలో ఆగస్టు 6 నాటికి తొలిసారి 175 డెంగ్యూ కేసులు నమోదుకాగా.. ఆగస్టు తొలివారంలో తొలిసారి వందకు పైగా డెంగ్యూ కేసులు రికార్డ్ కావడం ఢిల్లీ ప్రజల్ని కంగారు పెడుతోంది.
మరోవైపు.. పరీక్షల కోసం పంపిన 20 శాంపిల్స్‌లో 19 ‘తీవ్రమైన’ టైప్ 2 డెంగ్యూ స్ట్రెయిన్‌ను కనుగొనడం ఆందోళన కలిగిస్తోంది. డెంగ్యూ విజృంభణతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయ్యింది. ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహిస్తోంది. డెంగ్యూతోపాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం, మునిసిపల్ కార్పొరేషన్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గత నెలలో భారీ వర్షాలు, వరదలు ఢిల్లీని ముంచెత్తాయి. యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని షేక్ అయింది.
వరదల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు రోజుల తరబడి నీటిలోనే మునిగిపోవడంతో దోమల ఉత్పత్తి పెరిగింది. ఇప్పటికీ.. కొన్ని ప్రాంతాలను బురద భయం వెంటాడుతోంది. అదే సమయంలో.. మున్సిపల్ సిబ్బంది కూడా సమ్మె చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇక.. ప్రస్తుత డెంగ్యూ కేసుల సంఖ్య గత ఆరేళ్లలోనే అత్యధిక కేసులుగా లెక్కలు చెప్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన 348 డెంగ్యూ కేసులతో పోల్చితే.. ప్రస్తుత పరిస్థితి తీవ్రమైనదిగా చెప్తున్నారు అధికారులు. ఇక.. 2015లో తీవ్రస్థాయిలో డెంగ్యూ ఢిల్లీని దడదడలాడించింది. అప్పట్లో వేలల్లో కేసులు నమోదు కాగా.. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..