Ghulam Nabi Azad: దేశంలో మరో కొత్త పార్టీ.. పేరు ప్రకటించిన గులాం నబీ ఆజాద్..

Democratic Azad Party: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఏం, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన గులాం నబీ ఆజాద్..

Ghulam Nabi Azad: దేశంలో మరో కొత్త పార్టీ.. పేరు ప్రకటించిన గులాం నబీ ఆజాద్..
Gulam Nabi Azad Announced New Party and Flag

Updated on: Sep 26, 2022 | 1:53 PM

Democratic Azad Party: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఏం, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 26వ తేదీన తన పేరు పేరును, జెండాను ప్రకటించారు. తన పేరులో ఆజాద్ కూడా కలిసొచ్చేలా.. డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. హిందీ, ఉర్దూలో సుమారు 1500 పేర్లను పరిశీలించిన తర్వాత డెమొక్రటిక్ ఆజాద్ పార్టీగా పేరు నిర్ణయించామని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. హిందూస్థానీ పేరును కూడా పరిశీలించామని, అయితే దేశం ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, స్వాతంత్య్రంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, దీనిలో భాగంగా డెమొక్రటిక్ ఆజాద్ పార్టీగా నామకరణం చేసినట్లు గులాం నబీ ఆజాద్ తెలిపారు. పార్టీ జెండాను కూడా ఆయన విడుదల చేశారు.

డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ జెండా నిలువుగా మూడు రంగుల్లో ఉంది. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికలో పార్టీ జెండాను తీర్చిదిద్దారు. కశ్మీర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ఎజెండా అని పార్టీ పేరు ప్రకటన సందర్భంగా గులాం నబీ ఆజద్ వెల్లడించారు. నవరాత్రుల ప్రారంభం రోజు శుభ దినం కాబట్టి.. తన పార్టీ పేరును ప్రకటించాలనుకున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జమ్ము కశ్మీర్ కు చెందిన పలువురు నాయకులతో పాటు దేశ వ్యాప్తంగా పలువరు నుంచి 1500కు పైగా పేర్ల జాబితా వచ్చిందన్నారు. అయితే అన్ని సంస్కృతులు, మతాల ప్రజలకు అర్థం అయ్యేలా తన పార్టీ పేరు ఉండాలని భావించి డెమొక్రటిక్ ఆజాద్ పార్టీగా పేరు పెట్టినట్లు స్పష్టంచేశారు గులాం నబీ ఆజాద్. తన పార్టీలో ఎలాంటి వివక్ష ఉండబోదని, మతం, కులం ప్రభావం అసలే ఉండదని ఈసందర్భంగా గులాం నబీ ఆజాద్ తెలియజేశారు.

ప్రస్తుతం తన పార్టీ జమ్ము కశ్మీర్ కే పరిమితం అవుతుందని, భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించే విషయంపై ఆలోచిస్తానని ఇప్పటికే గులాం నబీ ఆజాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో 50 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెప్పి ఆగష్టు 26వ తేదీన గులాంనబీ ఆజాద్ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే తాను సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినప్పటికి.. సరిగ్గా నెలరోజులకు పార్టీ పేరును ప్రకటించారు. రాజీనామా సందర్భంగా కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీనింగ్ లెస్ అంటూ కూడా గులాంనబీ ఆజాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీల పనితీరుతో రాహుల్ గాంధీకి ఎటువంటి పోలిక లేదని విమర్శించారు.  తాను పార్టీలో ఉండటం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదని.. తాను పార్టీ విడిచి వెళ్లిపోవాలని వారు కోరుకున్నారని కూడా చెప్పిన విషయం తెలసిందే. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని భావించి తాను  పార్టీ ఏర్పాటు చేసినట్లు గులాంనబీ ఆజాద్ వెల్లడించిన విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీలో తనకు 8 రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తే 7 రాష్ట్రాల్లో గెలిచామని.. ప్రస్తుతం రాహుల్ గాంధీ నాయకత్వంలో అన్ని ఓటములే అంటూ గతంలో గులాంనబీ ఆజాద్ ఘటుగానూ  స్పందిచారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు గులాంనబీ ఆజాద్ బీజేపీ తో కలిసి పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఆజాద్ తన కొత్త పార్టీ పేరును, జెండాను ప్రకటించారు. త్వరలో జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ ఏ వ్యూహాంతో ముందుకు వెళ్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఒంటరిగా పోటీచేసి, ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతిస్తారా అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. లేదా ముందుగానే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల ముందు కంటే ఎన్నికల తర్వాతే గులాంనబీ ఆజాద్ కమలం పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.  జమ్మూ కశ్మీర్ లో బీజేపీకి వ్యతిరేకంగా మిగిలిన పార్టీలన్నీ కూటమి కట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈదశలో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చడానికే గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా కొనసాగుతోంది. ఈప్రశ్నలు అన్నింటికి భవిష్యత్తులో సమాధానాలు దొరికే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us