
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ మహ్మద్ నబీ ఇంటిని భద్రతా బలగాలు నాశనం చేశాయి. శుక్రవారం తెల్లవారు జామున దక్షిణ కాశ్మీర్ పుల్వామాలో ఉన్న అతని ఇంటికి చేరుకున్న బలగాలు పేలుడు పదార్థాలతో ఇంటిని నేలమట్టం చేశాయి. పరిదాబాద్‌లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా విధులు నిర్వమిస్తున్న ఉమర్.. గత సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. నేతాజీ సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ ఆత్మహుతి దాడి ఘటనలో ఇప్పటి వరకు సుమారు 13 మంది వరకు మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
అయితే ఎర్రకోట పేలుడు స్థలంలో దొరికిన DNA నమూనాలు డాక్టర్ ఉమర్ నబీ తల్లితో సరిపోలాయి, సోమవారం దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ i20 కారుతో అతనికి సంబంధం ఉందని అధికారులు నిర్ధారించారు. దీనిపై దర్యాప్తును ముమ్మరం చేసిన బలగాలు మరిన్ని ఆధారాలను సేకరించేందుకు.. ఈ మేరకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) సహాయంతో నియంత్రిత పద్దతిలో అతని ఇంటిని కూల్చివేశారు. పేలుడు తర్వాత, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రాత్రిపూట దాడులు నిర్వహించి, డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులలో ముగ్గురు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకాలపాలకు పాడ్పడే వారికి హెచ్చరికలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిపినట్టు అధికారులు చెప్పుకొచ్చారు.
అయితే ఒకప్పుడు తన సమాజంలో విద్యాపరంగా తెలివైన వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉమర్, గత రెండు సంవత్సరాలుగా ఇలాంటి కార్యకలాపాలవైపు మొగ్గుచూపినట్టు అధికారులు తెలిపారు. అలాగే ఇతను అనేక రాడికల్ మెసేజింగ్ గ్రూపులలో చేరినట్లు అధికారులు గుర్తించారు. ఈ పేలుడు ఘటనలో అనుమానితులుగా ఉన్న డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ షాహీన్ షాహిద్ లు ఈ కుట్రకు ప్లాన్ చేసేందుకు, దాన్ని ఎక్సిక్యూట్ చేసేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్ త్రీమాను ఉపయోగించినట్టు అధికారులు కనుగొన్నారు. ఆపరేషన్‌లోని కొన్ని భాగాలను నిర్వహించడానికి ఉమర్ కొంతమందితో కలిసి చిన్న సిగ్నల్ సమూహాన్ని ఏర్పాటు చేశాడని తెలిపారు. ఇందుకు సహకరించేందుకు వారికి ఉమర్ రూ.26లక్షలు డబ్బు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.