Cold Wave: చలి పులి.. వణుకుతున్న ఉత్తర భారతం.. మున్ముందు మరింత…

|

Dec 26, 2022 | 8:41 AM

భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం నాడు ఉత్తర భారత రాష్ట్రాలకు రాబోయే ఐదు రోజుల పాటు పొగమంచు హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్‌లోని చాలా ప్రాంతాలలో, హర్యానా, చండీగఢ్‌లోని కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Cold Wave: చలి పులి.. వణుకుతున్న ఉత్తర భారతం.. మున్ముందు మరింత...
Cold Wave
Follow us on

ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఉత్తర వాయవ్య భారతం గజగజలాడుతోంది. చండీగఢ్‌, ఢిల్లీ, హర్యానాల్లో చలిగాలులు గడగడలాడిస్తున్నాయి. ఢిల్లీ నగరంలోనూ, హరియాణాల్లో దట్టమైన పొగమంచు కప్పేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రానున్న మరికొద్ది రోజుల పాటు నార్త్‌ రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో చలి తీవ్రత భారీగా పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీలుగా నమోదయ్యింది. అనేక ప్రాంతాల్లో ఈ రోజు సైతం శీతల గాలులు వీచే ప్రమాదం ఉన్నదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక చండీగఢ్‌ లో గరిష్ట ఉష్ణోగ్రత 11.1 డిగ్రీలుగా ఉంది. అంబాలాలో 11 డిగ్రీలు, హిసార్‌లో 10.2 డిగ్రీలు, అమృత్‌సర్‌లో 12.9 డిగ్రీలు, గంగానగర్‌లో 10.3 డిగ్రీలు, బరేలిలో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల పాటు శీతల వాతావరణం, దట్టమైన మంచుకురిసే పరిస్థితులున్నట్టు ఐఎండీ వెల్లడించింది.

కశ్మీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. కశ్మీర్‌ ప్రాంతం మరింత గడ్డకట్టుకుపోతోంది. సఫ్దర్‌జంగ్‌, రిడ్జ్‌, అయానగర్‌ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడునుంచి ఐదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్‌లో మైనస్‌ 5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం బయటకు వచ్చేపరిస్థితి లేదు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్‌లో సైతం మైనస్‌ 5.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి