ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో లింక్ కొనసాగిస్తున్న భార్యాభర్తల జంటను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్‌కి అనుబంధంగా ఉందని భావిస్తున్న ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ఖొరసాన్’ అనే మరో సంస్థతో కూడా టచ్‌లో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. సౌత్ ఢిల్లీలోని జామియానగర్ లో ఓ మారుమూల ఇంట్లోఉన్న వీరు తమ గుట్టు బయటపడకుండా రహస్యంగా జీవిస్తున్నట్టు తెలిసింది. 36 ఏళ్ళ జెహాన్ జబ్ సమి, 39 ఏళ్ళ అతని భార్య హీనా బషీర్ బేగ్.. ఇద్దరూ ఢిల్లీ నగరంలో సీఏఏ వ్యతిరేక అల్లర్లను రెచ్ఛగొట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సాధనాలతో ఈ జంట.. ముస్లిం యువతను ఐసిస్‌కి అనుకూలంగా మార్చేందుకు యత్నించారని, వీరి ఇంటి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను, హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నామని ఖాకీలు పేర్కొన్నారు. వీరు పలువురు సీనియర్ ఐసిస్ సభ్యులతోను, ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లతోను నిత్యం కాంటాక్టులో ఉండేవారట.. సీఏఏ అన్నది బ్లాక్ లా అని, దీనివల్ల ముస్లిములకు హాని కలుగుతుందని రాసి ఉన్న ఆర్టికల్స్ కూడా తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని సమర్థిస్తున్నవారు ముస్లిములకు శత్రువులని వీరు ప్రచారం చేస్తూ వచ్చారట. ఢిల్లీలో ఉగ్రదాడులు జరిపేందుకు ఈ జంట ప్లాన్ లు వేసిందని, ఇందులో భాగంగా ఐసిస్ మ్యాగజైన్ ‘సాత్ అల్-హింద్’ కి వ్యాసాలు రాసిందని తెలుస్తోంది. తరచూ జమ్మూ కాశ్మీర్ కి వెళ్లి వచ్ఛే ఈ కపుల్ పట్టుబడతారని తాము కూడా ఊహించలేదని పోలీసులు తెలిపారు.