Mystery Muder Case: రోజుకు వందల కేసులు నమోదువుతాయి. వాటి పరిష్కారానికే పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అలాంటిది ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా 25 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసును ఛేదించారు. ఈ కేసు ఛేదనలో ఢిల్లీ పోలీసుల శ్రమకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిందితుడికి సంబంధించి కనీస ఆధారాలు లేకపోయినప్పటికీ.. కేసును ఛేదించి ఔరా అనిపించారు పోలీసులు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపడంతో.. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు ఢిల్లీ పోలీసులు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 1997లో తుగ్లకాబాద్‌లో నివసించే కిషన్ లాల్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును విచారించిన పాటియాలా హౌస్ కోర్టు.. అనుమానితుడైన రాముని అన్‌ట్రేసబుల్‌గా ప్రకటించింది. దాంతో కేసు మరుగునపడింది. అయితే, ఈ కేసును 2021లో పాత కేసుల పరిష్కారంపై శిక్షణ పొందిన పోలీసు బృందానికి అప్పగించారు. కేసు ఫైల్‌ను పరిశీలించిన ఈ స్పెషల్ పార్టీ.. నిందితుడిని పట్టుకునేందు తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా, ఆటో కంపెనీ ప్రతినిధులుగా, రకరకాల మారు వేషాలు వేశారు. ఈ క్రమంలోనే.. గతంలో మృతి చెందిన వారి బంధువులకు నగదు సాయం అందిస్తున్నట్లు చెప్పి ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో అనుమానితుడైన రాము బంధువును గుర్తించారు. అతడి సాయంతో ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాన్‌పూర్ గ్రామానికి చేరుకుని, అక్కడ మరికొందరు బంధువులను కలిశారు. ఈ క్రమంలో నిందితుడైన రాము కుమారుడు ఆకాశ్ ఫోన్ నంబరు సంపాదించారు. అనంతరం అతడి ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించి దాని సాయంతో హంతకుడు రాము లక్నోలోని కపుర్తలాలో ఉంటున్నట్టు తెలుసుకున్నారు.
హత్య అనంతరం యూపీ వెళ్లి లక్నోలో స్థిరపడ్డ రాము.. అశోక్ యాదవ్ పేరుతో ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులను పొందినట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. చిట్‌ఫండ్ డబ్బుల కోసమే కిషన్‌లాల్‌ను హత్యచేసినట్టు రాము అంగీకరించాడు. అయితే, 25 ఏళ్లనాటి కేసును పరిష్కరించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు ప్రశంసించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..