
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా ఢిల్లీలో అవయవ దానంపై ప్రత్యేక ప్రచారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గురువారం (సెప్టెంబర్ 17) అవయవ దాన ప్రతిజ్ఞ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల్లో అవయవ దానంపై అవగాహన పెంచడం, మరింత మందిని దానానికి ప్రోత్సహించడం, అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.
ఢిల్లీ సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తా స్వయంగా అవయవ దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రతిజ్ఞ పత్రాన్ని పూర్తి చేశారు. అవయవ దానం ద్వారా ఒక వ్యక్తి నిర్ణయం మరెన్నో ప్రాణాలకు కొత్త ఆశను కల్పించగలదని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆన్‌లైన్‌లో అవయవ దాన ప్రతిజ్ఞ
ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రత్యేక అవయవ దాన ప్రతిజ్ఞ పోర్టల్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీ నివాసితులు ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ అవయవాలను దానం చేయడానికి ప్రతిజ్ఞ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే డిజిటల్ ప్రతిజ్ఞ పత్రం ఆటోమేటిక్‌గా రూపొందుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.
జీబీ పంత్ ఆసుపత్రిలో SOTTO
అవయవ దానం, అవయవాలు మరియు కణజాల మార్పిడి ప్రక్రియలను మెరుగ్గా సమన్వయం చేసేందుకు జీబీ పంత్ ఆసుపత్రిలో స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (SOTTO)ను కూడా ప్రారంభించారు. ఢిల్లీలో అవయవ, కణజాల దాన కార్యకలాపాలను సమన్వయం చేయడంతో పాటు దానాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం.
అవగాహనకు విస్తృత ప్రచారం
ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రతిజ్ఞలకే పరిమితం చేయకుండా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, అవగాహన కార్యక్రమాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ స్థాయిలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘సేవా పక్షోత్సవం’లో భాగంగా ప్రారంభించిన ఈ ప్రత్యేక పోర్టల్ ద్వారా అవయవ దాన ప్రక్రియను మరింత సులభతరం చేయడమే లక్ష్యమన్నారు. సీఎం రేఖా గుప్తా SOTTO వెబ్‌సైట్‌లో మొదటి రిజిస్ట్రేషన్ చేసుకుని అవయవ దానానికి ప్రతిజ్ఞ చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ ప్రచారం ద్వారా అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు అవసరమైన అవయవాలు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
On the birthday of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, launched Delhi’s Online Organ Donation Pledge Campaign and registered my own pledge to donate my organs.
Organ donation carries a profound thought within it. Even after one life’s journey is complete, it can become a new beginning for another. More of us should reflect on this choice, speak about it with our families, and consider making this deeply humane pledge.
#SevaSankalpAbhiyan
#HappyBdayPMModi— Rekha Gupta (@gupta_rekha) September 17, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..