
ఢిల్లీ పేలుడు ఘటనలో అనుమానిత స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నట్లు ఫరీదాబాద్ పోలీసులు ప్రకటించారు. ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసిన ఉన్న కారును స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాది డా.ఉమర్ పేరుపై రిజిస్టర్ అయిన ఎకో స్పోర్ట్స్ కారు DL10CK0458 కోసం ఢిల్లీ, హర్యానా, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉదయం నుంచి గాలించారు. చివరకు ఖండవాలి గ్రామం దగ్గర కారును గుర్తించారు. ఎర్రకోట దగ్గర పేలుడుకు వాడిన i20 కారుతో పాటు ఉగ్రవాదుల దగ్గర ఎకో స్పోర్ట్స్ కారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బుధవారం పోలీసులు వాహనం కోసం భారీ గాలింపు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ఆ కారు డాక్టర్ ఉమర్ కు చెందిన ఖండవాలి ఇంటి వెలుపల ఆపి ఉంచినట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని పిలిపించారు. వాహనం ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు DL10CK0458 ఉమర్ ఉన్ నబి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ కారును ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ RTOలో నవంబర్ 22, 2017న రిజిస్టర్ చేశారు. ఉమర్ ఈశాన్య ఢిల్లీలో నకిలీ చిరునామాను ఉపయోగించి వాహనాన్ని కొనుగోలు చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు అర్థరాత్రి ఆ ప్రదేశంలో తనిఖీలు నిర్వహించారు.
ప్రజల భద్రతను నిర్ధారించడానికి కారుకు 200 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న మొత్తం ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టారని పోలీసులు తెలిపారు. వాహనం తనిఖీ తర్వాత, తదుపరి ఫోరెన్సిక్ పరీక్ష, దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వాహనాన్ని స్వాధీనం చేసుకోనుంది.
ఇదిలాఉంటే.. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో యూపీలో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..