Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో సూసైడ్ బాంబర్ ఉమర్‌ చివరి వీడియో ఇదే..

ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో ఉగ్రవాది ఉమర్‌ చివరి వీడియో బయటకు వచ్చింది. అందులో ఆత్మాహుతి దాడిని సమర్థించుకునే విధంగా డా.ఉమర్‌ వాదన ఉంది. ప్రపంచం ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంది.. నిజానికి ఇది అమరులయ్యే ఆపరేషన్, ఇస్లాంలోనూ దీనికి చోటుంది అని అతను వ్యాఖ్యానించడం గమనార్హం.

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో సూసైడ్ బాంబర్ ఉమర్‌ చివరి వీడియో ఇదే..
Umar Un Nabi

Updated on: Nov 18, 2025 | 10:46 AM

నవంబర్‌ 10 రెడ్‌ఫోర్ట్ ప్రాంతంలో జరిగిన భీకర కార్‌ బ్లాస్ట్‌లో వెలుగులోకి వస్తున్న ప్రతి క్లూ దర్యాప్తును కీలకదశకు తీసుకెళ్తోంది. తాజాగా దాడికి క్షణాల ముందు ఉమర్ ఉన్ నబీ రికార్డ్ చేసిన అన్‌సీన్ వీడియో ఏజెన్సీలకు లభ్యమైంది. ఇందులో ఆత్మాహుతి దాడిని ‘తప్పుగా అర్థం చేసుకున్న కాన్సెప్ట్’ అంటూ.. దానిని బలిదాన ఆపరేషన్‌గా చూపించే ప్రయత్నం చేశాడు ఉగ్రవాది ఉమర్.

ఉగ్రవాద సిద్ధాంతాల ప్రభావంలో ఉన్నట్లు స్పష్టంగా కనిపించే ఆ వీడియోను పోలీసులు బ్లాస్ట్‌ జరిగిన తరువాత స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉమర్‌ మాట్లాడిన మాటలు అతను దాడి ముందు ఉన్న మానసిక స్థితిని, తీవ్రవాద గ్రూపుల ప్రభావాన్ని బయటపెడుతున్నాయి. “ ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయి. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు.. భయంకరమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. చావే అంతిమ లక్ష్యం అని నిర్ణయించుకోవాలి. నిజానికి, అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు ” అని అతను వీడియోలో వ్యాఖ్యానించాడు.

అతని మాటల తీరు చూస్తే.. బ్లాస్ట్‌కు కొద్దిసేపు ముందే రికార్డ్‌ చేసిన వీడియో అనేది స్పష్టమవుతోంది. ఈ వీడియోతో పాటు CCTV ఫుటేజ్, ఇతర డిజిటల్ ఆధారాలు ఆధారంగా ఉమర్‌ ప్రయాణం ఎలా సాగిందో, దాడి టైమ్‌లైన్ ఎలా అమలైందో అధికారులు వివరంగా మ్యాప్ చేస్తున్నారు. పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్‌ ఉన్ నబీ, వైట్ కాలర్ ప్రొఫైళ్లు కలిగిన తీవ్రవాద మాడ్యూల్‌లో భాగమని విచారణలో బయటపడుతోంది. DNA పరీక్షల ద్వారా రెడ్‌ఫోర్ట్ వద్ద పేలిన కార్‌ను నడిపింది ఉమరేనని అధికారికంగా ధృవీకరించారు.

బ్లాస్ట్‌కు గంటల ముందే ఫరీదాబాద్‌లో జరిగిన భారీ ఆపరేషన్‌లో పోలీసులు 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు డాక్టర్లు అరెస్టు అయ్యారు. ఈ నెట్‌వర్క్ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ వరకు విస్తరించినట్లు తెలుస్తోంది.

వివిధ ప్రాంతాల్లో లభ్యమైన సాక్ష్యాలు, పేలుడు పదార్థాలు, పరికరాలు, డిజిటల్ ట్రేసులు.. అన్నింటి దృష్టిలో ఉమర్‌ ఈ మాడ్యూల్‌లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి అని అర్థమవుతోంది. ఈ కేసులో ఉమర్‌ సన్నిహితుడిగా చెబుతున్న జాసిర్ బిలాల్ వాణిని NIA అరెస్టు చేసింది. అంతకుముందు అమీర్ రషీద్ అలీను అరెస్టు చేశారు. బ్లాస్ట్‌కు ఉపయోగించిన కారు ఇదే వ్యక్తి పేరుతో నమోదు అయి ఉంది. అతడే ఉమర్‌కు సేఫ్‌హౌస్, లాజిస్టికల్ సపోర్ట్ అందించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరి అరెస్టులతో దాడిలో పాల్గొన్న మాడ్యూల్‌‌ను అధికారులు డీకోడ్ చేయనున్నారు.

కాగా ఢీల్లీ కార్ బ్లాస్ట్‌లో గాయపడిన ఇద్దరు.. లుక్మాన్ (50), వినయ్ పాఠక్ (50) LNJPలో చికిత్స పొందుతూ చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 15కు పెరిగింది. ఇంకా పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.