Patiala Violence: పంజాబ్‌లోని పాటియాలాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో శనివారం ఉదయం వరకు పాటియాలాలో కర్ఫ్యూ విధించారు. ఖలిస్తాన్ ముర్తాబాద్ పేరుతో శివసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడంతో వివాదం ప్రారంభమయ్యింది. శివసేన కార్యకర్తల ర్యాలీని ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఓ వర్గం తల్వార్లతో దాడులకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇరువర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కాల్పులు జరిపారు. అయితే అల్లరిమూకలు పోలీసుల పైకి రాళ్లు రువ్వాయి. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. పాటియాలాలోని కాళీమాత ఆలయం దగ్గర ఈ గొడవ జరిగింది. సంఘటనా స్థలానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు సిబ్బంది సహా నలుగురు గాయపడ్డారని పాటియాలా ఎస్‌ఎస్పీ నానక్ సింగ్ తెలిపారు. అనంతరం శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు జిల్లా మేజిస్ట్రేట్ సెక్షన్ 144 విధించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. పాటియాలా ఘటనపై పంజాబ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) డీజీపీ, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ అల్లర్ల వెనుక కుట్ర ఉందని పంజాబ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఘర్షణ తీవ్ర దురదృష్టకరం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పేర్కొన్నారు. దీనివెనుక ఎవరున్నా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని పేర్కొన్నారు. కాగా.. శివసేన ర్యాలీతో అల్లర్లు చెలరేగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించినట్టు తెలుస్తోంది. పోలీసుల వైఫల్యం తోనే ఈ ఘటన జరిగినట్టు పంజాబ్ ప్రభుత్వం అనుమానిస్తోంది. అయితే అనుమతి లేకుండానే శివసేన కార్యకర్తలు ఈ ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు.
పాటియాలాలోని దృశ్యాలు కలవరపెడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. శాంతి, సామరస్యం కోసం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ (రిటైర్డ్) అమరీందర్ సింగ్ కూడా ఈఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్చరికలు ఉన్నప్పటికీ చర్య తీసుకోవడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) నాయకుడు దల్జిత్ సింగ్ చీమా పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: