టెంట్ తొలగింపుపై వివాదమే ఘర్షణకు కారణమా ?

| Edited By: Pardhasaradhi Peri

Jun 17, 2020 | 1:17 PM

లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీలో భారత-చైనా దళాల మధ్య ఘర్షణకు కారణం ఓ టెంట్ తొలగింపుపై రేగిన వివాదమేనని తెలుస్తోంది. అయితే దీనిపై పెద్దగా వాస్తవాలు తెలియజేయని భారత సైన్యం..ఘర్షణలో 20 మంది మన సైనికులు..

టెంట్ తొలగింపుపై వివాదమే ఘర్షణకు కారణమా ?
Follow us on

లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీలో భారత-చైనా దళాల మధ్య ఘర్షణకు కారణం ఓ టెంట్ తొలగింపుపై రేగిన వివాదమేనని తెలుస్తోంది. అయితే దీనిపై పెద్దగా వాస్తవాలు తెలియజేయని భారత సైన్యం..ఘర్షణలో 20 మంది మన సైనికులు మృతి చెందగా.. 45 మంది చైనా సైనికులు గాయపడడమో, మరణించడమో జరిగిందని స్పష్టం చేసింది. మన సైనికుల్లో గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 17 మంది గాయపడ్డారని, అతి శీతల వాతావరణం వల్ల ఆ తరువాత ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ వెల్లడించింది. ఈ నెల 15, 16 తేదీల్లో రాత్రి వేళ.. గాల్వాన్ ప్రాంతంలో ఘర్షణ జరిగినప్పటికీ.. ఆ తరువాత ఉభయ దళాలు వెనక్కి వెళ్లాయని ఇవాళ ఉదయం ప్రకటించింది. అక్కడి యధాతథ పరిస్థితిని భంగపరచడానికి చైనా సైనికులు ప్రయత్నించారని, అసలు బోర్డర్ దాటడానికి మన దళాలు యత్నించలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. భారత భూభాగంలోనే మనవాళ్ళు సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. యధాతథ స్థితిని కొనసాగించాలని చైనాను కూడా ఇండియా కోరుతోందన్నారు.

గాల్వాన్ వ్యాలీలో ఓ వైమానిక స్థావరానికి దారి తీసే రోడ్డు నిర్మాణాన్ని ఇండియా గత అక్టోబరులో పూర్తి చేసింది. ఇందుకు చైనా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. వాస్తవాధీన రేఖ వద్ద మన వైపు సాధారణ కార్యకలాపాల నిర్వహణకే ఈ రోడ్డు నిర్మించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.