Cyclone Remal: పొంచి ఉన్న వానగండం.. వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం.. తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం..!

|

May 25, 2024 | 7:12 AM

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఆంధ్రప్రదేశ్‌పై తుఫాన్‌ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. నేటికి వాయుగుండం తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్‌కి రెమాల్‌‌గా నామకరణం చేశారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..

Cyclone Remal: పొంచి ఉన్న వానగండం.. వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం.. తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం..!
Cyclone Remal
Follow us on

బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఆంధ్రప్రదేశ్‌పై తుఫాన్‌ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. నేటికి వాయుగుండం తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్‌కి రెమాల్‌‌గా నామకరణం చేశారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..

ఆదివారం మే 26వ తేదీన అర్థరాత్రి బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీవ్ర తుపాన్‌గా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరందాటే సమయంలో గంటకు 90నుంచి 110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఉత్తర ఒడిశా, బెంగాల్, మిజోరాం..త్రిపుర, మణిపూర్‌పై తుఫాన్‌ ఎఫెక్ట్‌ బాగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్‌ సునంద తెలిపారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించారు. తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని వెల్లడించారు.

ఏపీపై తుఫాన్ ప్రభావం లేనట్లే..!

అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి శ్రీ సత్యసాయి మరియు వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలావుంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. పి. గన్నవరం, అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం తోపాటు పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. సముద్ర తీరంలో భీకర ఈదురు గాలులు వీస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…