దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. దేశంలోనే అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ఆ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ తదితర పాక్షిక ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే దీంతో ఆశించిన ప్రయోజనం దక్కడంలేదు. మహారాష్ట్రలో కోవిడ్ కేసుల నియంత్రణలో ఉద్ధవ్ థాక్రే సర్కారు విఫలమయ్యిందన్న విమర్శలూ వస్తున్నాయి. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అక్కడ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయంటూ బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్ల ఆ రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి కూడా క్రమంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడి నిమిత్తం రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే యోచనలో మహారాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. కఠిన ఆంక్షలు అమలుచేస్తే తప్ప రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని కట్టడిచేయడం సాధ్యంకాకపోవచ్చని నిపుణులు సూచించడంతో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. కోవిడ్ వ్యాధి లక్షణాలు లేనివారితోనే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని టాస్క్ ఫోర్స్ భావిస్తోంది. టాక్క్ ఫోర్స్ బృందం నిర్ణయం మేరకు కరోనా వైరస్ కట్టడికి కఠిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదలచేయనుంది.
కరోనా ఉధృతి నేపథ్యంలో కోవిడ్ పేషెంట్స్ కోసం మరిన్ని బెడ్స్ సిద్ధం చేసుకోవాలని, ఇతర వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. అలాగే కోవిడ్ రోగుల కోసం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఉద్ధవ్ ఆదేశించారు. రాష్ట్రంలోని హెల్త్ వర్కర్స్‌కు వీలైంత త్వరగా కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చేలా చూడాలని సూచించారు. అలాగే మహారాష్ట్రకు మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి ఉద్ధవ్ థాక్రే కోరనున్నారు.
అలాగే కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా…అధిక నిల్వలు కలిగిన గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌ను సమకూర్చుకోవాలని టాస్క్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కట్టడికి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం…దీనిపై ఏప్రిల్ 14 తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..Corona : తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోన్న కరోనా, రోజూ వందల్లో వచ్చే కేసులు.. ఒక్కసారిగా వేలల్లోకి
Covid-19 patient: మధ్యప్రదేశ్‌లో అమానుషం.. కరోనా బాధితుడిని చితకబాదిన పోలీసులు.. వీడియో..