Corona Vaccination: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. భారత్‌లో వ్యాక్సినేషన్ ఇప్పటి వరకూ 19,50,183 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 35,785 సెంటర్లలో వ్యాక్సిన్‌ను అందించినట్లు తెలిపింది. సోమవారం ఒక్క రోజు 3,34,679 మందికి, 7,171 సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో 348 మంది మాత్రం స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనాపై పోరులో ముందుండి పని చేసిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, పోలీసులకు తొలి విడతలో టీకాలను అందిస్తున్నారు. ఇక రెండో విడతలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కీలక నేతలకు టీకాలను అందించనున్నారు.
అయితే దేశ వ్యాప్తంగా పంపిణీ చేసే కరోనా టీకా విజయవంతంగా కొనసాగుతోందని, కొందరు వ్యాక్సిన్‌పై లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారని, అలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని కేంద్రం సూచించింది.