Pahalgam: ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వానికి 6 ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆరు కీలక ప్రశ్నలు అడిగింది. భద్రతా లోపాలు, నిఘా వైఫల్యం, ఉగ్రవాదుల చొరబాటు మొదలైన అంశాలపై కాంగ్రెస్ ప్రశ్నించింది. దాడి బాధ్యత, హోం మంత్రి రాజీనామా అవసరం, ప్రధాని మోదీ బాధ్యతల గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

Pahalgam: ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వానికి 6 ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్!
Pm Modi And Rahul Gandhi

Updated on: Apr 25, 2025 | 7:27 PM

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశం మొత్తం కోపంగా ఉంది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ దాడి తర్వాత, పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. ఉగ్రవాద అంశంపై అన్ని ప్రతిపక్షం పార్టీలు ప్రభుత్వానితో నిలుస్తామని చెప్పాయి. కానీ ఇప్పుడు ఈ దాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ ఆరు ప్రశ్నలు అడిగింది.

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాంగ్రెస్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వల్ల దేశం మొత్తం బాధపడిందని పేర్కొంటూ.. దేశ ప్రజలు కొన్ని సమాధానాలు కోరుకుంటున్నారంటూ.. కశ్మీర్‌లో నిరంతరం ఉగ్రవాద దాడులు జరుగుతున్నప్పటికీ భద్రతా వైఫల్యం ఎందుకు జరిగింది? సైన్యం, సరిహద్దులు నేరుగా మోదీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి, అయినప్పటికీ ఉగ్రవాదులు సరిహద్దు ప్రాంతం దాటి ఎలా అంత దూరం వచ్చారు? ఇంటెలిజెన్స్ అంత పెద్ద తప్పు ఎలా చేసింది? అంటూ ప్రశ్నలు లెవనెత్తింది.

కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ సంధించిన 6 ప్రశ్నలు ఇవే?

  1. భద్రతా లోపం ఎలా జరిగింది?
  2. నిఘా ఎలా విఫలమైంది?
  3. ఉగ్రవాదులు సరిహద్దు దాడి ఎలా ప్రవేశించారు?
  4. 28 మంది మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
  5. హోంమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా?
  6. ఈ తప్పుకు ప్రధాని మోదీ బాధ్యత తీసుకుంటారా?

నోట్ల రద్దుతో ఉగ్రవాదం అంతమవుతుందని చెప్పారు.. మరీ ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందని కూడా ప్రశ్నించారు. 28 మంది మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు? హోంమంత్రి తన వైఫల్యాన్ని అంగీకరించి రాజీనామా చేస్తారా లేక ప్రధానమంత్రి అన్నిటికీ క్రెడిట్ తీసుకున్నట్లే ఈ దాడికి బాధ్యత వహిస్తారా లేదా ప్రతిసారీ చేసినట్లుగా బాధ్యత నుండి పారిపోతారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే అఖిలపక్ష సమావేశం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో చాలా మంది అమాయకులు చనిపోయారని అన్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా, మనమందరం ఐక్యంగా ఉన్నామని, వారికి మద్దతు ఇస్తామని మేమందరం కలిసి చెప్పాం. అక్కడ జరిగిన ప్రమాదాన్ని మేం ఖండిస్తున్నాం. మనమందరం ఒకటే అనే సందేశాన్ని దేశానికి ఇవ్వాలి. అదే సమయంలో, ఉగ్రవాద అంశంపై తాను ప్రభుత్వంతో ఉన్నానని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రభుత్వ చర్యకు మేం మద్దతు ఇస్తున్నామని అన్నారు.