“భారత జాతీయ కాంగ్రెస్(Congress) అంతరించిపోకూడదని” అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కాంగ్రెస్ అగ్రనాయత్వంతో జరిగిన సమావేశంలో అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఇతర అగ్ర నాయకులతో జరిగిన సమావేశాలలో ఇందుకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ఇండియటూడే కథనం ప్రచురించింది. అయితే పదేపదే పరాజయాలు హస్తం పార్టీని కలవరపెడుతున్నాయని.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తడబడిందని కథనంలో ప్రస్తావించింది. కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు హస్తం పార్టీ ప్రయత్నిస్తోందని.. ఇందుకోసం పార్టీ నాయకత్వం ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించినట్లు కథనంలో పేర్కొంది. కాంగ్రెస్ పునరుజ్జీవనానికి సంబంధించిన బ్లూప్రింట్(Blur Print)ను ప్రశాంత్ కిషోర్ రూపొందించినట్లు తెలిసింది.
తన ప్రెజెంటేషన్‌లో ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయ రంగంలో కాంగ్రెస్ ప్రస్తుత స్థితి, పార్టీ బలాలు, బలహీనతలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు.. ఈ ప్రణాళిక 2024 లోక్‌సభ ఎన్నికల తయారీకి సంబంధించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశ జనాభా, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య, మహిళలు, యువత, చిన్న వ్యాపారవేత్తలు, రైతుల పట్ల పార్టీ దృక్పథాన్ని హైలైట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ 2024లో తొలిసారిగా ఓటు వేయబోయే 13 కోట్ల మందిపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం.
కాంగ్రెస్‌కు లోక్‌సభ, రాజ్యసభల్లో కేవలం 90 మంది ఎంపీలు, దేశంలో 800 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నాయకత్వానికి గుర్తు చేశారని.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని, మరో మూడు రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. 13 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉందని… 1984 నుంచి కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గుముఖం పట్టిందని ప్రశాంత్ కిషోర్ వివరించినట్లు కథనంలో ప్రస్తావించింది. .
ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది..
1. కాంగ్రెస్ తన నాయకత్వ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి
2. కూటమి సమస్యలు పరిష్కరించాలి.
3. కాంగ్రెస్ అట్టడుగు స్థాయిలో తన కార్యకర్తలు, నాయకులను సమీకరించాలి.
4. పార్టీ తన కమ్యూనికేషన్ వ్యవస్థను సరిదిద్దాలి.
Read Also.. JoSAA 2022: జోసా కౌన్సెలింగ్ తేదీని ప్రకటించిన ఐఐటీ బాంబే.. సెప్టెంబరు 12 నుంచి..