పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓవైపు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెల్పుతున్నాయి. అంతేకాదు.. వీలైనప్పుడల్లో బహిరంగ సభల్లో.. కేంద్రం తెచ్చిన ఈ చట్టంపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా పలు సభల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న ప్రసంగాలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. వీరు చేస్తున్న ప్రసంగాలు.. ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయంటూ వీరిపై కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు.
యూపీలోని అలీగఢ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో.. సోనియా, ప్రియాంక, అసదుద్దీన్ ఓవైసీలపై ప్రదీప్ గుప్తా అనే అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ ముగ్గురితోపాటుగా… ఓ పాత్రికేయుడి పేరు కూడా అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
కాగా, యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. యూపీలో జరిగిన పలు ఘర్షణల్లో పలువురు పౌరులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మృతుల కుటుంబీకులను పరామర్శించేందుకు.. రాహుల్ గాంధీతో కలిసి మీరట్ వెళ్తుండగా.. పోలీసులు వీరిని అడ్డుకున్నారు.