ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా సాగింది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులు, నిధుల విడుదల, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందేలా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై విజ్ఞాపనలు చేశారు.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..!
Chabdrababu Delhi Visit,

Edited By:

Updated on: Jul 22, 2026 | 8:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా సాగింది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులు, నిధుల విడుదల, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందేలా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై విజ్ఞాపనలు చేశారు.

పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు సుమారు 55 నిమిషాల పాటు కలిశారు. తొలుత కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీ అప్పలనాయుడుతో కలిసి ప్రధాని మోదీని ఆయన ఛాంబర్‌లో కలిసి, ఆగస్టు 1న జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య సుమారు అరగంట పాటు ఏకాంతంగా చర్చలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సమన్వయం, కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, దేశ రాజకీయాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

ప్రధాని మోదీతో భేటీ అనంతరం చంద్రబాబు పార్లమెంట్‌లోనే పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆక్వా రైతులు, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు, రాష్ట్రంలో నదుల అనుసంధానం, జల్ జీవన్ మిషన్ నిధుల విడుదల, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షించారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు, రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు.

అలాగే పార్లమెంట్ లాబీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషిలను కూడా చంద్రబాబు కలిశారు. ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారం అవసరమైన ప్రాజెక్టులపై విజ్ఞాపనలు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించేందుకు సానుకూల చర్చలు జరిగినట్లు సమాచారం.

ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ, పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళనలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో భేటీ జరగలేదు. అనంతరం ఏపీ భవన్‌లో పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైన చంద్రబాబు, కేంద్ర శాఖలతో సమన్వయం, రాష్ట్ర ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మొత్తం మీద ఈ ఢిల్లీ పర్యటన ద్వారా రాష్ట్రానికి కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలను వేగవంతం చేసే దిశగా సీఎం చంద్రబాబు కీలక అడుగులు వేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us