free bus travel for women: పంజాబ్ మహిళలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే ప్రతిపాదనకు పంజాబ్ రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా పంజాబ్ రోడ్‌వేస్ ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈ సదుపాయాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఇందుకోసం నూతన పథకాన్ని ప్రవేశపెడుతామని మార్చి 5వ తేదీన అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలను సాధికారతవైపు నడిపించడంలో భాగంగానే ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి తమ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని బుధవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Happy to share that our Cabinet has approved free travel within the State for all women/girls of Punjab in State Transport buses from 1st April. I’m sure it will be a strong step towards further empowering the women of Punjab. pic.twitter.com/4lLdVsIhGE
— Capt.Amarinder Singh (@capt_amarinder) March 31, 2021
మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిపాదనకు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పంజాబ్‌లో అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే, ప్రభుత్వ ఏసీ, వోల్వోతో పాటు ఇతర లగ్జరీ సర్వీసుల్లో మాత్రం ఛార్జీలు ఉంటాయని స్పష్టంచేసింది. ఉచితంగా ప్రయాణించే మహిళలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారుగా ఉన్న గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం మహిళలకు లబ్ది చేకూర్చడమే కాకుండా రాష్ట్రంలో మహిళా భద్రతకు ఎంతో దోహదం చేస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ప్రభుత్వ నిర్ణయంతో పంజాబ్‌లో దాదాపు 1.31కోట్ల మంది బాలికలు, మహిళలకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, పంజాబ్ జనాభా 2.77కోట్ల కాగా వారిలో కోటి 46 లక్షల మంది పురుషులు, కోటి 31లక్షల మంది మహిళలున్నారు. తాజా పథకం వయసుతో సంబంధం లేకుండా పంజాబ్‌లోని మహిళలందరికీ వర్తించనుంది.