న్యూఢిల్లీ, జనవరి 10: దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు ఇటీవల వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తు్న్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెదిరింపుల వెనుక ఉన్న అసలు దొంగను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఓ స్కూల్లో చదువుతున్న విద్యార్థి పనేనని తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. స్కూల్ ఎగ్జామ్స్ తప్పించుకునేందుకే పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపు మెయిల్స్ పంపినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు 12వ తరగతి చదువుతున్న సదరు విద్యార్థిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే..
ఢిల్లీలోని పలు స్కూళ్లకు దాదాపు 6 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో.. అధికారులు కంటిమీద కునుకులేకుండా తెగ హైరానాపడిపోయారు. ఇది ఓ స్కూల్లో చదువుతున్న 12వ తరగతి చేసిన నిర్వాకంగా తాజాగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రతిసారి తన స్వంత స్కూల్ మినహా.. మిగితా స్కూళ్ల పేరు మీద బాంబ్ బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకే ఇలా ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయా స్కూళ్లను ట్యాగ్ చేస్తూ ఒకేసారి పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ చేసేవాడు. ఓ సారైతే ఏకంగా 23 స్కూళ్లకు ఒకేసారి మెయిల్ పంపించాడు.
స్కూల్‌లో పరీక్షలు తప్పించుకునేందుకే సదరు మైనర్ విద్యార్థి బాంబు బెదిరింపు మెయిల్స్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ బెదిరింపుల వల్ల ఎగ్జామ్స్ రద్దు అవుతాయని, స్కూళ్లకు కూడా సెలవులు వస్తాయన్న ఉద్దేశంతో విద్యార్ధి ఇలా చేసినట్లు పసికట్టారు. గత కొద్ది వారాల్లోన ఢిల్లీలో డజన్ల సంఖ్యలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన అధికరాలు పటిష్ట నిఘా పెట్టారు. దీంతో గతకొన్ని వారాల పాటు ఢిల్లీ అధికారులంతా టెన్షన్ పడ్డారు. ఇలా బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చిన వెంటనే సంబంధిత స్కూళ్లను ఖాళీ చేసి బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లు ఆయా క్యాంపస్‌లను తమ స్వాధీనంలోకి తీసుకునేవి. అటు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ఇలాంటి శాంతాభద్రతల సమస్య ఎప్పుడూ తలెత్తలేదని తలపట్టుకున్నారు.
గత నెలలోనే DPS RK పురం, పశ్చిమ్ విహార్‌లోని GD గోయెంకా స్కూల్‌తో సహా మొత్తం 40 స్కూళ్లకు బాంబ్ బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఆయా స్కూళ్లలో బాంబులు అమర్చామని, వాటిని నిర్వీర్యం చేసేందుకు 30 వేల డాలర్లు ఇవ్వాలని ఈ మెయిల్‌లో డిమాండ్ చేసేవారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయంగానూ తీవ్రదుమారం లేపింది. బాంబు బెదిరింపులు శాంతిభద్రతల పరిస్థితిపై మోదీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అతిషి దూషించడంతో రాజకీయ వివాదానికి దారితీసింది. దేశ రాజధానిలో పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఉన్నారని, అది ఢిల్లీ ప్రభుత్వం కిందకు రాదని, ఇలాంటి నకిలీ బెదిరింపు మెయిల్స్ తరచూ వస్తున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో స్కూళ్లతోపాటు, అనేక ఎయిర్ పోర్టులకు నకిలీ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఇది అధికారులలో తీవ్రభయాందోళనలకు దారితీసింది. ఈ నకిలీ మెయిల్స్‌కు సంబంధించి 25 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గత ఏడాది అదుపులోకి తీసుకున్నారు. మరోమారు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ముంబైలో 17 ఏళ్ల డ్రాపౌట్‌ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా 12వ తరగతి విద్యార్ధిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇకనైనా బాంబ్ బెదిరింపులు ఆగుతాయేమో వేచి చూడాలి.