
భారత ప‌్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటనతో చైనా అధికారుల్లో వణుకుపుట్టింది. ప్రధాని అత్యవసరసర పర్యటనపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. ప్రధాని లఢాఖ్ పర్యటనపై చైనా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరుకు సైనిక, దౌత్యపరంగా చర్చలు జరుపుతున్న సమయంలో, పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లో ఎవ్వరూ పాల్గొనకూడదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ప్రకటించారు.
గల్వాన్ ఘర్షణ అనంతరం నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోదీ లఢాఖ్ లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. వాస్తవానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించాల్సి ఉండగా.. ప్రధాని మోదీనే ప్రత్యక్షమయ్యారు. తన పర్యటనలో ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని చర్చించారు. వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న తాజా పరిస్థితులను గురించి ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ఈ పర్యటనలో మోదీతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలు పాల్గొన్నారు.