
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వీటిని వాడొద్దని హెచ్చరించింది. చాట్ జీపీటీ లాంటి ఏఐ ఫ్లాట్‌ఫామ్స్ వాడటం చాలా ప్రమాదకరమని, సమాచారం బయటకు పొక్కే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రభుత్వ సమాచారాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఏఐ టూల్స్ వాడటం వల్ల ఇతర దేశాలకు రహస్య సమాచారం తెలిసే అవకాశముందని, భద్రత దృష్ట్యా వాటిని వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. దేశానికి సంబంధించిన రహస్య సమాచారం కాపాడే భద్రత ఉద్యోగులకు ఉంటుందని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెవరూ సమాచారాన్ని ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది. షేర్ చేస్తే ఇతర దేశాలకు సమాచారం తెలిసి దేశానికే ముప్పు ఏర్పడుతుందని తెలిపింది. సమాచారం షేర్ చేయడం వల్ల దేశంలో ఏం జరుగుతుంది..? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? చేపట్టబోయే పనులు ఏంటి? లాంటి కీలక సమాచారం లీక్ అయ్యే ప్రమాదముందని, ఏఐ సంస్థలు వీటిని పక్క దేశాలకు షేర్ చేసే అవకాశముందని హెచ్చరించింది. దీనికి అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని, సమాచారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు వీటిని వాడకపోవడమే మంచిదని కేంద్ర ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
కాగా ఏఐ టూల్స్ వల్ల మన వ్యక్తిగత సమాచారం కూడా లీక్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే మనం ఏదైనా సమాచారం కోసం వ్యక్తగత వివరాలు అందించినప్పుడు ఏఐ టూల్స్ భవిష్యత్తులో మెరుగ్గా సమాచారం అందించడానికి వాటిని తమ డేటాబేస్‌లో భద్రపర్చుకుంటాయి. దీని వల్ల వ్యక్తిగత వివరాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. అందుకే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు ఏఐ టూల్స్‌లో అప్‌లోడ్ చేయకపోవడం మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్ వివరాలు లాంటివి అసలు ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు