కేంద్ర కేబినెట్‌కీలక నిర్ణయాలు.. కష్టాల్లో ఉన్న రంగాలకు ప్యాకేజీ, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, భారత్‌ నెట్‌ పథకానికి ఆమోదం

|

Jun 30, 2021 | 10:26 PM

Central Cabinet : ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేంద్ర కేబినెట్‌కీలక నిర్ణయాలు..  కష్టాల్లో ఉన్న రంగాలకు ప్యాకేజీ,  విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, భారత్‌ నెట్‌ పథకానికి ఆమోదం
Pm Narendra Modi
Follow us on

Central Cabinet : ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు ప్రధాని. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారత్‌ నెట్‌ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ఈ పధకాన్ని ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అమలు చేస్తారు. దీని కోసం కేంద్రం రూ.19041 కోట్ల నిధులను విడుదల చేసింది.

విద్యుత్‌ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంస్కరణల అమలుకు రూ.3.03 లక్షల కోట్లు విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. నాలుగేళ్లలో రైతులకు ఉచితంగా కేంద్రమే కరెంట్‌ ఇచ్చే విధంగా ప్రణాళికను సిద్దం చేశారు. సౌరవిద్యుత్‌కు పెద్దపీట వేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. అంతేకాకుండా పట్టణ ప్రాంత ప్రజలు ప్రతిరోజు రీచార్జ్‌ చేసుకునే విధంగా విద్యుత్‌ వ్యవస్థను ఆధునీకరించబోతున్నారు . పవర్‌ డిస్కంల సంస్కరణ స్కీముకు రూ. 3.03 లక్షల కోట్ల విడుదలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఐదేళ్ల పాటు అమల్లో ఉండే విద్యుత్‌ సంస్కరణలకు కేబినెట్‌ ఓకే చెప్పింది. డిస్కంలను ఆధునీకరించి ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ప్రోత్సహకాలు ఉంటాయి. గత బడ్జెట్‌ లోనే ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. భారత్‌ నెట్‌ పథకాన్ని తొలుత 16 రాష్ట్రాల్లో అమలు చేస్తారు. 16 రాష్ట్రాల లోని 3 లక్షల 61 వేల గ్రామాల్లో ఈ పధకాన్ని అమలు చేస్తారు. ఇప్పటివరకు లక్ష 56 వేల గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.

కేబినెట్‌ భేటీ తరువాత ప్రధాని మోదీ అధ్యక్షతన మరో కీలక భేటీ జరిగింది. సీనియర్‌ మంత్రులతో భేటీ అయ్యారు మోదీ. కేబినెట్‌ లోని మంత్రుల పనితీరుపై సమీక్షించారు . త్వరలో జరిగే కేంద్ర కేబినెట్‌ విస్తరణలో కొత్తగా ఎవరికి చోటు దక్కుతుంది ? ఎవరిపై వేటు పడుతుందని అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read also : ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు అనేక కంపెనీల సంసిద్ధత : మంత్రి కేటీఆర్