అత్యంత కీలకమైన అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు సమాచారం. ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన పూర్తి హక్కులను రాష్ట్రాలకే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారాల తిరిగి అప్పగింతకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. విద్య సంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారిని ఓబీసీ జాబితాలో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాబితాలో మార్పలు చేసే అధికారం పార్లెంటుకు మాత్రమే ఉందంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ మరాఠాలకు కోటా ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో ఓబీసీ జాబితాలో మార్పులు, చేర్పులు చేసే అధికారం రాష్ట్రాలకే అప్పగించే బిల్లుకు కేంద్ర క్యాబినెట్ అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. 389 పోక్సో కోర్టులతోపాటు దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్ ట్రాక్ సె్పషల్ కోర్టులను మరో 2 ఏళ్లపాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.