IIT Baba Arrest: ఐఐటీ బాబా అరెస్ట్‌..! అరెరె మళ్లీ ఏమైంది..? వీడియో

మహా కుంభమేళాలో ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌ కొట్టేసిన ఐఐటీ బాబా ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో భారత్‌ ఓడిపోతుందని చెప్పి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం మరో మారు వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏకంగా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అసలేం జరిగిందంటే..

IIT Baba Arrest: ఐఐటీ బాబా అరెస్ట్‌..! అరెరె మళ్లీ ఏమైంది..? వీడియో
IIT Baba Arrest

Updated on: Mar 03, 2025 | 8:19 PM

జైపూర్‌, మార్చి 3: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళాలో ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌ కొట్టేసిన ఐఐటీ బాబాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐఐటీ బాబాగా పేరుగాంచిన అభయ్‌ సింగ్‌ వద్ద మత్తుపదార్ధాలు ఉండటంతో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నార్కోటిక్ డ్రగ్స్ అండ్‌ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద అతనిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో భారత్‌ ఓడిపోతుందని చెప్పి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్న ఐఐటీ బాబా సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇది మరువక ముందే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. అసలేం జరిగిందంటే..

ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్ అయిన అభయ్‌ సింగ్‌ ఇహపరమైన అన్ని బంధాలను తెంచుకుని ధ్యాత్మికత వైపు నడిచి సత్య అన్వేషణలో ఉన్నట్లు ఇటీవల కుంభమేళలో చెప్పాడు. అయితే అతడు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నాడని, అక్కడ ఆయన గొడవ చేస్తున్నట్లు పోలీసులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. దాంతో ఆ హోటల్‌కు వెళ్లిన పోలీసులకు ఐఐటీ బాబా గంజాయి మత్తులో జోగుతూ కనిపించాడు. పోలీసుల సోదాల్లో అతని వద్ద గంజాయి పట్టుబడింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం కొద్ది మొత్తంలోనే గంజాయి సేవించినట్లు తేలడంతో బెయిల్‌పై విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

అయితే బెయిల్‌పై విడుదలైన తర్వాత ఐఐటీ బాబా మీడియాతో మాట్లాడుతూ.. హోటల్లో ఉంటున్న నాపై కొందరు నేను గొడవ చేస్తున్నానని ఫిర్యాదు చేసి అరెస్ట్ అయ్యేలా చేశారు. ఇది వింత సాకు. కుంభమేళాలో కనిపించిన దాదాపు ప్రతి బాబా గంజాయి ప్రసాదంగా తీసుకుంటారు. మరి వారందరినీ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించాడు. ఈ రోజు తన పుట్టిన రోజని, ఆనందంగా ఉండేందుకు గంజాయి సేవించినట్లు ఓ విలేకరి ప్రశ్నకు బదులిచ్చాడు. పైగా పోలీసుల విచారణలో కూడా ఐఐటీ బాబా తాను అఘోరి బాబానని, ఆచారం ప్రకారం గంజాయి సేవించినట్లు పేర్కొనడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.