
న్యూఢిల్లీ, ఆగస్ట్ 17: కార్లు, ద్విచక్ర వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే ఈ వాహనాలకు సంబంధించిన పన్నుల విధానంలో ఉపశమనం కల్పించాలని యోచిస్తోంది. పన్ను రేట్లలో వ్యత్యాసాలను సృష్టించే కొత్త GST విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం చిన్న కార్లకు 28 శాతం GSTతో పాటు 1 నుంచి 3 శాతం చిన్న సెస్సు రేట్లను వసూలు చేస్తుంది. అదే విధంగా SUV వాహనాలకు GST, సెస్సు రేట్లతో సహా 50 శాతం వరకు పన్ను చెల్లించవల్సి వస్తుంది.
అయితే కార్లు, ద్విచక్ర వాహనాలపై GST రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కార్లు, SUVలు, ద్విచక్ర వాహనాలతో పాటు ఎయిర్ కండిషనర్లు, నిర్మాణ సామగ్రిపై కూడా పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు GST వర్గీకరణ కోసం SUVలకు సంబంధించిన ప్రస్తుత నిర్వచనాన్ని తొలగించే అవకాశం ఉంది. అంటే కొత్త GST విధానంలో రెండు పన్ను శ్లాబులు ఉంటాయి. మెరిట్, స్టాండర్డ్ అనే 2 రకాలు ఉంటాయి. మెరిట్ వర్గంలో 5 శాతం వరకు GST రేట్లు ఉన్న వస్తువులు, ఉత్పత్తులు ఉంటాయి. ఇక ప్రామాణిక GST వర్గంలో 18 శాతం GST కలిగిన వస్తువులు ఉంటాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే వచ్చే దీపావళి నాటికి కొత్త GST విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారత ఆటోమోటివ్ పరిశ్రమలోని అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. తగ్గిన GST రేట్లతో తయారీ, విడి భాగాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. రూ. 10 లక్షల లోపు చిన్న కార్లు, ఎంట్రీ-లెవల్ మోటార్ సైకిళ్ళు అధిక తయారీ రేట్లకు దారితీసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్లు 5 శాతం GST రేట్లతో కొనసాగే అవకాశం ఉంది. లగ్జరీ కార్లపై కూడా దాదాపు GST రేట్లు ఇలాగే ఉండే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.