సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ) పూర్తిగా చట్టబధ్ధమైనది,రాజ్యాంగబధ్ధమైనదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది పార్లమెంట్ సార్వభౌమాధికారానికి సంబంధించినదని, కోర్టులో ఎవరూ సవాలు చేయజాలరని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు సమర్పించిన తన ప్రిలిమినరీ అఫిడవిట్ లో వెల్లడించింది. రాజ్యాంగంలోని 246 అధికరణం కింద.. ఏడో షెడ్యూల్ లిస్టులోని ఏ అంశానికి సంబంధించిన విషయంపై అయినా చట్టాలు చేసే అసాధారణ అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఈ చట్టం ఏ భారతీయ పౌరుడి హక్కులను కాలరాయడంలేదని, ప్రజల సెక్యులర్ లేదా లీగల్ లేక ప్రజాస్వామ్య హక్కులకు భంగకరం కూడా కాదు. అని వివరించింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో.. ఇక్కడి మైనారిటీల పట్ల ఇది నిర్లక్ష్యం చూపేదిగా ఉందని ఏ పిటిషన్ కూడా స్పష్టం చేయలేదని, ఈ అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఏఏని వ్యతిరేకిస్తూ వందకు పైగా దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది.