Union Budget 2026: ఏవి చౌకయ్యాయి.. ఏవి ఖరీదయ్యాయి? క్లియర్ కట్‌గా ఇక్కడ చూడండి..

యూనియన్ బడ్జెట్‌ 2026లో ప్రభుత్వం మౌలిక వసతులు, తయారీ రంగానికి పెద్దపీట వేసింది. అదే సమయంలో కొన్ని వస్తువులు చౌకయ్యేలా, మరికొన్ని ఖరీదయ్యేలా నిర్ణయాలు తీసుకుంది. ఔషధాలు, లెదర్ ఉత్పత్తులు, సీ ఫుడ్ వంటి వాటిపై ఊరట కనిపిస్తుండగా.. మద్యం, సిగరెట్లు, స్టాక్ ట్రేడింగ్ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

Union Budget 2026: ఏవి చౌకయ్యాయి.. ఏవి ఖరీదయ్యాయి? క్లియర్ కట్‌గా ఇక్కడ చూడండి..
Nirmala Sitharaman

Updated on: Feb 01, 2026 | 3:35 PM

మోదీ ప్రభుత్వ మూడో యూనియన్ బడ్జెట్‌ (2025–26)ను ఆర్థిక మంత్రి ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల అభివృద్ధి, భారీ మూలధన వ్యయం దిశగా ఈ బడ్జెట్‌ స్పష్టమైన ప్రాధాన్యం చూపించింది. దేశ ఆర్థిక వృద్ధికి దీర్ఘకాల పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్‌లో తీసుకొచ్చిన విధాన నిర్ణయాలతో పలు కీలక రంగాల్లో ధరలపై ఊరట కనిపించనుంది. లెదర్ ఉత్పత్తులు, క్యాన్సర్ ఔషధాలు, సీఫుడ్‌పై కస్టమ్స్ సుంకాల్లో సడలింపులు, డ్యూటీ ఫ్రీ దిగుమతులకు అనుమతులు, ప్రత్యేక మినహాయింపులు ప్రకటించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు ఊతం ఇవ్వడంతో పాటు వినియోగదారులు, రోగులు, ఉత్పత్తిదారులపై భారం తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఇదే సమయంలో క్యాపిటల్ మార్కెట్ల విషయంలో ప్రభుత్వం కాస్త కట్టుదిట్టైన వైఖరిని ప్రదర్శించింది. షేర్ బైబ్యాక్ పన్ను, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT), ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ (TCS)లో ప్రతిపాదించిన మార్పుల వల్ల ట్రేడింగ్ వ్యయాలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పన్ను ఎస్కేప్‌కు అడ్డుకట్ట వేయడం, పన్ను అనుసరణను బలోపేతం చేయడమే ఈ చర్యల వెనుక ఉన్న లక్ష్యంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

బడ్జెట్‌పై స్పందించిన బజాజ్ బ్రోకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ మనిష్ జైన్.. తక్షణ లాభాల కంటే మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచడంపైనే ఈ బడ్జెట్‌ దృష్టి పెట్టిందన్నారు. ఆర్థిక లోటు నియంత్రణకు ముందుకెళ్లే ప్లాన్ స్పష్టంగా ఉండటంతో రూ.12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ హామీ, తయారీ రంగంపై నిరంతర దృష్టి భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకొస్తాయని తెలిపారు.

మౌలిక వసతులు, సెమీకండక్టర్లు, బయో-ఫార్మా, వ్యూహాత్మక తయారీ వంటి రంగాలపై ఫోకస్‌ పెట్టడం ద్వారా పెట్టుబడి అవకాశాలు మరింత విస్తరించనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని విభాగాల్లో లావాదేవీ ఖర్చులు పెరిగినా, విధానాల కొనసాగింపు, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాల వృద్ధిపై స్పష్టత వంటి అంశాలే పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రధాన ఆధారమవుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఏవి చౌకయ్యాయి?

1. వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసుకునే వస్తువులు

2. క్యాన్సర్ రోగులకు ఉపయోగించే 17 రకాల ఔషధాలు

3. 7 అరుదైన వ్యాధులకు మందులు, ప్రత్యేక వైద్య ఆహారం (FSMP)

4. లెదర్ ఉత్పత్తులు (ఫుట్‌వేర్)

5. టెక్స్‌టైల్ వస్త్రాలు

6. సీ ఫుడ్ ఉత్పత్తులు

7. విదేశీ టూర్ ప్యాకేజీలు

8. బ్యాటరీల కోసం లిథియం-అయాన్ సెల్స్

9. సోలార్ గ్లాస్

10. కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్)

11. బయోగ్యాస్ మిశ్రమ సీఎన్‌జీ

12. విమాన తయారీకి అవసరమైన విడిభాగాలు

13. మైక్రోవేవ్ ఓవెన్

14. విదేశీ విద్య (ఫారిన్ ఎడ్యుకేషన్)

ఏవి ఖరీదయ్యాయి?

1. మద్యం

2. సిగరెట్లు

3. అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన భాగాలు

4. ఖనిజాలు, ఇనుప ధాతువు, బొగ్గు

5. ఆదాయపు పన్ను తప్పుదోవ పట్టించడం (మిస్‌రిపోర్టింగ్)

6. స్టాక్ ఆప్షన్లు, ఫ్యూచర్ ట్రేడింగ్

టూరిజానికి బూస్ట్… 

సాహసయాత్రలు, పర్వత పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తూ హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ–కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పర్యావరణానికి హాని కలగకుండా పర్వత మార్గాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యాటక మౌలిక వసతులను విస్తరించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, తమిళనాడులోని పొతోగై మలై వంటి తూర్పు, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కూడా ఎకో–టూరిజం ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. స్థానిక ప్రకృతి సంపదను పరిరక్షిస్తూ పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు సాగనున్నాయి.

మొత్తంగా ఈ బడ్జెట్ నిర్ణయాల ద్వారా పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టమవుతోంది.

సాంస్కృతిక పర్యాటకాభివృద్ధి

దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 15 పురావస్తు ప్రదేశాలను అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇవి కేవలం సందర్శన స్థలాలుగా మాత్రమే కాకుండా, అనుభవ ఆధారిత కేంద్రాలుగా మారేలా మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం లోథాల్, సారనాథ్, హస్తినాపూర్ వంటి చారిత్రక ప్రదేశాలను ఎంపిక చేశారు. దీని ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అలాగే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

వైద్య పర్యాటక కేంద్రాలు

భారతదేశాన్ని ప్రపంచస్థాయి వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక ఆసుపత్రులు, చికిత్సానంతర సంరక్షణ, పునరావాస సేవలు, ఆయుష్ విధానాలను ఒకే చోట అందించే సమగ్ర ఆరోగ్య సముదాయాలుగా ఇవి అభివృద్ధి చెందనున్నాయి. ఈ చర్యల ద్వారా విదేశీ రోగులను ఆకర్షించడంతో పాటు వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.