ఇవాళ వైశాఖ పౌర్ణమి. మన దేశమే కాదు.. ఆసియా దేశాలన్నీ ఈ శుభదినం కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాయి .. కారణం ఈ రోజు బుద్ధ భగవానుడి జయంతి.. అదే బుద్ధ పూర్ణిమ! ప్రపంచ మానవాళి దు:ఖానికి కారణం కనుగొన్న బుద్ధుడు నడయాడిన దేశం మనది! నాలుగు ఆర్య సత్యాలను బోధించిన గౌతముడి పాదస్పర్శతో పావనమైన దేశం మనది! బౌద్ధమత వృక్షం పల్లవించిన పవిత్ర ప్రదేశం మనది! బుద్ధ పూర్ణిమ అంటే మానవాళికి ఓ మార్గనిర్దేశం చేసిన బుద్ధ భగవానుడు జన్మించిన రోజు! అహింసో పరమోధర్మ అని చాటి చెప్పిన మహనీయుడు.. మహాబోధి నీడలోన మహిమ గనిన గౌతముడు ఆయన! అన్ని దేశాల్లో అందరిలో ప్రసిద్ధుడాయన! వైశాఖ శుద్ధపూర్ణిమ రోజున లుంబినిలో బద్ధభగవానుడు జన్మించాడని అంటారు.. ఆయన మహాబోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందింది క్రీస్తుపూర్వం 588లో.. గౌతముడికి జ్ఞానోదయం అయిన రోజు.. బుద్ధగయలో ఆయన నిర్వాణం.. కుషి నగరంలో ఆయన పరినిర్వాణం జరిగిన సందర్భాలను పురస్కరించుకుని కూడా బౌద్ధ పౌర్ణిమను పాటిస్తారు కొందరు. బుద్ధపూర్ణిమను వివిధ దేశాలలో వివిధ పేర్లతో పిలుచుకుంటారు.. పేర్లు ఎలా ఉన్నా.. ఈ పవిత్రమైన రోజున బౌద్ధులంతా ప్రశాంత మనసుతో.. ఆ తథాగతుడి బోధనలు తల్చుకుంటారు. బౌద్ధ ఆరామాలను సందర్శిస్తారు. బౌద్ధ భిక్షువులకు అన్నపానీయాలను అందచేస్తారు. బుద్ధుడి విగ్రహాల ముందు దీపాలు, అగరొత్తులు వెలిగిస్తారు. పూలమాలలు సమర్పిస్తారు. పళ్లను నైవేద్యంగా అర్పిస్తారు.
నేపాల్‌లో స్వన్యపున్హిగా, సింగపూర్‌లో వెసాక్‌గా, ఇండోనేషియాలో హరివైసాక్‌గా, థాయ్‌లాండ్‌లో విశాక్‌బుచ్చగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. ఇక్కడే కాదు.. బౌద్ధులు ఉన్న ఆగ్నేయాసియా దేశాల్లో వైశాఖ పూర్ణిమను ఘనంగా జరుపుకుంటారు. శ్రీలంక, వియత్నాం, టిబెట్, మయన్మార్, భూటాన్, కొరియా, చైనా, కంబోడియా, జపాన్ దేశాల్లోనూ బుద్ధ పూర్ణిమ వేడుకలు జరుగుతాయి. సాధారణంగా బుద్ధ పూర్ణిమ రోజున ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం బుద్ధ గయ భక్తులతో కిక్కిరిసిపోతుంది..కరోనా కాలం కాబట్టి ఈసారి అంతగా ఉండదేమో! మహాబోధి వృక్షాన్ని సందర్శించడానికి పెద్ద పెట్టున వస్తారు. బుద్ధ గయలోనే 80 అడుగుల ఎత్తయిన బుద్ధుడి విగ్రహం ఉంది.. ఆ విగ్రహం దగ్గర నుంచి పెద్ద ఊరేగింపు మొదలువుతుంది. రంగురంగుల పతకాలతో మహాబోధి ప్రాంగణం కళకళలాడుతుంటుంది. వారణాసి దగ్గర ఉన్న సార్‌నాథ్ కూడా ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమే! ఇక్కడే బుద్ధుడు తన మొదటి బోధను వినిపించాడు. థాయ్‌లాండ్, టిబెట్, భూటాన్‌ల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షవులు ఇక్కడికి వస్తారు. బుద్ధుడి ఆశీస్సులను తీసుకుంటారు. ఒడిషాలోని ధవళగిరిలో కూడా బౌద్ధ పౌర్ణిమ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బుద్ధ పూర్ణిమ రోజున బౌద్ధులు నియమనిష్టలతో ఉంటారు. పూర్తిగా శాకాహారమే తీసుకుంటారు. పాలు, పంచదార, బియ్యంతో చేసిన పరమాన్నం వండి బుద్ధుడికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. వీలైనంత వరకు తెల్లటి దుస్తులను ధరిస్తారు.. రెండు రోజుల ముందే ఇంటిని శుభ్రం చేస్తారు. విద్యుద్దీపాలతో ఇంటిని అలంకరిస్తారు.
భారత-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో లుంబిని క్షేత్రం ఉంది. అచ్చంగా చెప్పాలంటే నేపాల్‌లోని రూపాందేహి జిల్లాలో ఉంది. ఇక్కడే మాయాదేవి గర్భాన గౌతమ బుద్ధుడు జన్మించాడు. హిమాలయ పర్వతపాద ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం బుద్ధుడు విద్యాబుద్ధులు నేర్చుకున్న కపిలవస్తుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. లుంబిని ఇప్పుడో స్మాకరక కేంద్రం.. బౌద్ధులకు పుణ్యస్థలి. లుంబినిలో ఓ పెద్ద వనం. ఓ పుష్కరిణి. తల్లి మాయాదేవి పేరున ఉన్న పెద్ద దేవాలయం ఉన్నాయి. 1896లో ఆర్కియాలజీ అధికారులు లుంబిని ప్రాంతాన్ని గుర్తించారు.. మౌర్య చక్రవర్తి అశోకుడు లుంబినిని సందర్శించాడనడానికి ఆధారాలు కనుగొన్నారు. 1997లో లుంబిని క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.. బౌద్ధమత విభాగాలైన మహాయాన, వజ్రయాన ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయి.
కపిలవస్తు దేశానికి మహారాజైన శుద్ధోధనుడు- మాయదేవి దంపతుల ముద్దు బిడ్డ సిద్ధార్థుడు. సిద్ధార్థుడు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాయాదేవి ఓ కల కంటుంది.. ఆరు దంతాలున్న ఓ ఏనుగు తన గర్భములోనికి కుడివైపు నుంచి ప్రవేశించినట్టుగా ఆమెకు కల వస్తుంది. తొలి పురుడు పుట్టింట్లోనే జరగాలన్నది శాక్యవంశ ఆచారం.. గర్భవతిగా ఉన్న మాయాదేవి ప్రసవానికి ముందు తల్లిగారింటికి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో లుంబిని అనే ప్రాంతంలో ఆమెకు నొప్పులు వస్తాయి. అక్కడే ఓ సాల వృక్షం కింద ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే మాయాదేవి కన్నుమూస్తుంది. సిద్ధార్థుండంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం.. ఆ సిద్ధార్థుడే గౌతమ బుద్ధుడు. మన దగ్గర బుద్ధునికి సంబంధించిన ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.. బుద్ధుడు నిర్వాణం చెందిన కుషీ నగరం మన దేశంలోనే ఉంది. బౌద్ధ జాతక కథల్లో కుషీనగర్‌ను కుషావతి అన్నారు. ప్రాచీన భారతంలో మల్లరాజ్యానికి కుషావతి కేంద్రం. హిరణ్యావతి నది తీరంలో ఉన్న కుషావతి కాలక్రమంలో కుషానారాగా మారింది.. ఇప్పుడు కుషీనగర్ అయ్యింది.. అశోకుడి పాలనలో ఇక్కడ ఎన్నో కట్టడాలు నిర్మితమయ్యాయి..
గౌతముడు బోధి వృక్షం కింద జ్ఞానాన్ని సముపార్జించిన ప్రాంతమే బోధ్ గయా! మనమేమో బుద్ధగయ అంటాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక బౌద్ధ ఆశ్రమాలు ఉన్నాయి.. ఇక్కడున్న ప్రధాన ఆశ్రమాన్ని బోధిమానంద విహారగా పిలుచుకుంటారు. మహాబోధి ఆలయం అని కూడా అంటారు. మహాబోధి ఆలయాన్ని ఆశోకుడు కట్టించాడంటారు కొందరు.. మరికొందరేమో ఒకటో శతాబ్దంలో కుషాణులు నిర్మించారంటారు.. బోధి వృక్షం కింద మూడు పగళ్లు, మూడు రాత్రులు గౌతముడు ధ్యానం చేశాడు.. జ్ఞానాన్ని పొందాడు.. బుద్ధుడయ్యాడు..బుద్ధగయ ఫల్గు నది తీరంలో ఉంది. పాట్నాకు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధ గయలో నేపాల్, భూటాన్, టిబెట్, చైనా, జపాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాంలకు చెందిన బౌద్ధ ఆశ్రమాలు ఉన్నాయి.. 2002లో బుద్ధగయను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది.. ఇక్కడ బుద్ధపూర్ణమ వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయి.
తథాగతుడు తొలిసారి ధర్మప్రబోధన చేసిన పవిత్ర ప్రాంతం సారనాథ్. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి ఇది కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.. ఇదో జింకలవనం.. బౌద్ధమతస్తులు సందర్శించి తీరవలసిన క్షేత్రం ఇది! గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత అయిదు వారాలకు బోధగయ నుంచి సారనాథ్‌కు వెళ్లాడు.. సారనాథ్ అప్పట్లో ఉసీనగరం.. తన సహచరులైన అయిదుగురు సాధువులకు బుద్ధుడు ధర్మోపదేశం చేసినప్పుడు సంఘం అవిర్భవించింది. మొదటి బోధను ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటారు. ఇండోనేషియాలో ముస్లిం మహిళలు కూడా బుద్ధుడి జయంతిని జరుపుకుంటారు. బౌద్ధ ఆరాధకులతో కలిసి లాంతర్లను ఆకాశంలో వదులుతారు. బుద్ధ జయంతి రోజున బోరోబుదుర్ ఆలయంలో వెసాక్ డే ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.. దీపాల వెలుగులో ఆలయానికి కొత్త శోభను తీసుకొస్తాయి. నేపాల్‌లోనూ వైశాఖ పూర్ణిమ రోజునే బుద్ధ జయంతిని జరుపుకుంటారు. బుద్ధుడు జన్మించిన నేల కాబట్టి నేపాల్ వాసులు చాలా ఘనంగా.. గర్వంగా జరుపుకుంటారీ వేడుకను.. జపాన్‌లో మాత్రం ప్రతి ఏడాది ఏప్రిల్ ఎనిమిది బుద్ధ జయంతిని జరుపుకుంటారు. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. తైవాన్‌లో మే నెలలో వచ్చే రెండో ఆదివారాన్ని బుద్ధుడి జయంతిని జరుపుకుంటారు. ఆ రోజునే ప్రపంచమంతా మదర్స్ డేను జరుపుకుంటుంది.
కంబోడియాలో బుద్ధ భగవానుడి జయంతిని విసాక్ బొకిగా పిలుచుకుంటారు. ఆ రోజున పబ్లిక్ హాలీడే! బౌద్ధ భిక్షవులంతా జయపతాకాలతో ఊరేగింపు తీస్తారు.. కమలం పువ్వులతో బుద్ధుడికి పూజలు చేస్తారు. కొవ్వొత్తులను వెలిగిస్తారు. చైనాలో ఉన్న బౌద్ధ ఆలయాలు ఆ రోజున అందంగా ముస్తాబవుతాయి. దీపాల వెలుగులో దేదీప్యమానమవుతాయి. ప్రజలు బౌద్ధ సన్యాసులకు ఆతిథ్యమిస్తారు. చైనాలో కూడా పబ్లిక్ హాలిడేనే! కొరియాలో సీగా తన్‌సినిల్‌గా పిలుచుకుంటారు. తామరపువ్వు ఆకారంలో ఉన్న దీపాలు ఆలయాలకు కొత్త శోభను ఇస్తాయి.. ఇక మలేషియాలో వెసాక్ డేగా జరుపుకుంటారు. మయన్మార్‌లో కసాన్ పున్నమిగా బుద్ధజయంతిని జరుపుతారు. బోధి వృక్షాలకు పూజలు చేస్తారు.. మొక్కలను నాటుతారు. శ్రీలంకలో వెసాక్ తోరణగానూ, పిలియందలగానూ జరుపుకుంటారు. సరస్సుల్లో దీపాలను వదులుతారు. ఇక్కడ కూడా వైశాఖమాసం పున్నమి రోజునే బుద్ధ జయంతిని జరుపుకుంటారు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలో ఉన్న బౌద్ధులు కూడా ఈ ఉత్సవాలను ఎంతో గొప్పగా జరుపుతారు.
మరిన్ని ఇక్కడ చూడండి: 1000 crore defamation notice: చిక్కుల్లో బాబా రాందేవ్ , రూ. 1000 కోట్ల పరువునష్టం నోటీసు పంపిన ఉత్తరాఖండ్ ఐఎంఏ…