బ్రిక్స్‌లో ప్రధాని మోదీ దౌత్య విజయం.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా పలు కీలక సంక్షోభాలు కొనసాగుతున్న వేళ.. యుద్ధాల కంటే చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలకు పరిష్కారం కనుగొనాలనే సందేశాన్ని బ్రిక్స్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి.

బ్రిక్స్‌లో ప్రధాని మోదీ దౌత్య విజయం.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం!
Brics Summit, New Delhi Declaration

Edited By:

Updated on: Sep 12, 2026 | 5:34 PM

న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభ్య దేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా పలు కీలక సంక్షోభాలు కొనసాగుతున్న వేళ.. యుద్ధాల కంటే చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలకు పరిష్కారం కనుగొనాలనే సందేశాన్ని బ్రిక్స్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. బ్రిక్స్ సమావేశం అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారతదేశం ప్రతిపాదించిన 10 ప్రతిపాదనలన్నీ ఆమోదం పొందాయని ఆయన పేర్కొన్నారు.

గతంలో పశ్చిమాసియా సంక్షోభంపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో విదేశాంగ మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడలేదు. అయితే ఈసారి దేశాధినేతల స్థాయిలో ఏకాభిప్రాయం సాధించడం భారత్‌కు దౌత్యపరంగా కీలక విజయంగా మారింది. విభిన్న ప్రయోజనాలు, అభిప్రాయాలు ఉన్న దేశాలను ఒకే ఉమ్మడి ప్రకటనకు తీసుకురావడంలో భారత్ అధ్యక్షత కీలకంగా పనిచేసిందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ప్రధాని మోదీ మాట్లాడుతూ, “న్యూఢిల్లీ ప్రకటనను ఆమోదించాలని ప్రతిపాదిస్తున్నాను. న్యూఢిల్లీ ప్రకటన ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఏ సభ్యుడూ ఎలాంటి అభ్యంతరం లేవనెత్తలేదు. న్యూఢిల్లీ ప్రకటన 2026 ఏకగ్రీవంగా ఆమోదించాము” అని అన్నారు. దీంతో సమావేశ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.

యుద్ధాలకు బదులు చర్చలే పరిష్కారం!

ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి అంశాల నేపథ్యంలో.. అంతర్జాతీయ వివాదాలకు చర్చలు, దౌత్యమే శాంతియుత పరిష్కార మార్గాలు అని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి. భారత్ మొదటి నుంచీ అనుసరిస్తున్న దౌత్యపరమైన వైఖరికి ఇది అనుగుణంగా ఉంది. అదే సమయంలో ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండిస్తూ.. ఎలాంటి కారణంతోనూ ఉగ్రవాదాన్ని సమర్థించలేమని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి.

UNSC సంస్కరణలకు మద్దతు

ప్రపంచ పాలనా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సహా అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. ప్రపంచ ఆర్థిక, రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా బహుపాక్షిక వ్యవస్థను మరింత సమగ్రంగా మార్చాలని పిలుపునిచ్చాయి.

వాణిజ్యం నుంచి డిజిటల్ సహకారం వరకు

బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, డిజిటల్ సహకారం, ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సభ్య దేశాల పాత్రను పెంచేందుకు పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేశారు.

భారత్‌కు దౌత్యపరంగా కీలక విజయం

బ్రిక్స్ విస్తరణ తర్వాత ఇరాన్, యూఏఈ వంటి భిన్న ప్రయోజనాలు, విభేదాలు ఉన్న దేశాలు కూడా ఒకే ఉమ్మడి ప్రకటనకు అంగీకరించడం భారత్ అధ్యక్షతకు పెద్ద పరీక్షగా నిలిచింది. ఆ పరీక్షలో భారత్ విజయం సాధించిందని దౌత్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొత్తంగా.. ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా బ్రిక్స్ దేశాలు యుద్ధాల కంటే దౌత్యం, విభేదాల కంటే చర్చలు, ఆధిపత్యం కంటే సమగ్ర ప్రపంచ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ఈ బ్రిక్స్ సంయుక్త ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం ప్రధాని మోదీకి ఒక ముఖ్యమైన విజయమని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఎదుట ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేయడం చాలా ముఖ్యమైన అంశం.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ చైనాకు ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా పంపారు, ఎందుకంటే భారతదేశం శాశ్వత సభ్యత్వం పొందలేకపోవడానికి చైనా కొన్ని విధాలుగా అడ్డంకిగా ఉంది. అంతేకాకుండా, యూఎన్‌సీఏలో కేవలం ఐదు దేశాలు మాత్రమే సభ్యులుగా ఉండటం, కొన్ని దేశాలకు నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండటం వంటి ప్రకటనపై ఒప్పందం కుదరడం కూడా ఒక ముఖ్యమైన విజయమే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us