రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్ కి కాస్త ఊరట లభించింది. తమ పార్టీకి చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడాన్ని ప్రశ్నిస్తూ..బహుజన్ సమాజ్ పార్టీ దాఖలు చేసిన అప్పీలును రాజస్తాన్ హైకోర్టు కొట్టివేసింది. అయితే దీనిపై సింగిల్ బెంచ్ విచారిస్తుందని ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 11 ఈ అప్పీలుపై సింగిల్ బెంచ్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. ఆ నిర్ణయం గెహ్లాట్ ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపవచ్చునని భావిస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు బీఎస్పీలోనే కొనసాగుతారని ఆ బెంచ్ ప్రకటిస్తే.. అసెంబ్లీలో గెహ్లాట్ బల పరీక్షను ఎదుర్కొనేటప్పుడు ఇబ్బందులు తప్పవు. ఈ ఆరుగురితో కలిపి తనకు మొత్తం 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గెహ్లాట్ చెప్పుకొంటున్నారు. కానీ కోర్టు నిర్ణయం మరొకలా ఉన్న పక్షంలో..ఆయన సంఖ్యా బలం 102 నుంచి 96 కి తగ్గుతుంది.
సభలో బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసమ్మతినేత సచిన్ పైలట్ నేతృత్వంలోని 18 మంది రెబెల్ సభ్యులు, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు తెలిపితే.. మొత్తం సంఖ్య 97 అవుతుంది. సభలో జరిగే ప్రొసీడింగ్స్ లో ఈ ఆరుగురు బీఎస్పీ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనకుండా తాత్కాలిక స్టే జారీ చేయాలని బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీలు కోర్టును కోరాయి.