బ్యాట్ తో కొట్టిన ఎమ్మెల్యే బయటపడ్డాడు

|

Jun 30, 2019 | 11:09 AM

మధ్యప్రదేశ్ లో ఓ మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇండోర్ లో ఆయన జైలు నుంచి విడుదల కాగానే ఆయన మద్దతుదారులు ఆయన మెడలో పూలమాల వేసి స్వాగతం పలికారు. జైల్లో తానెంతో హాయిగా గడిపానని చెప్పిన ఆకాష్.. తన నియోజకవర్గ అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పాడు. ఈ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు కాగానే ఇండోర్ లోని బీజేపీ కార్యాలయం […]

బ్యాట్ తో కొట్టిన ఎమ్మెల్యే బయటపడ్డాడు
Follow us on

మధ్యప్రదేశ్ లో ఓ మున్సిపల్ అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇండోర్ లో ఆయన జైలు నుంచి విడుదల కాగానే ఆయన మద్దతుదారులు ఆయన మెడలో పూలమాల వేసి స్వాగతం పలికారు. జైల్లో తానెంతో హాయిగా గడిపానని చెప్పిన ఆకాష్.. తన నియోజకవర్గ అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పాడు. ఈ ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు కాగానే ఇండోర్ లోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఇండోర్-3 నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకాష్ సీనియర్ పార్టీ నేత కైలాష్ విజయ్ వర్గీయ కొడుకు. ఇటీవల సిటీలో ఆక్రమణలకు వ్యతిరేకంగా డ్రైవ్ చేపట్టిన ఓ మున్సిపల్ అధికారిని ఈయన క్రికెట్ బ్యాట్ తో కొట్టి గాయపరిచాడు. ఇతని మద్దతుదారులు ఆయన వెంటబడి తరుముతూ తమ ‘ స్వామి భక్తి ‘ ని ప్రదర్శించుకున్నారు. ఆకాష్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా..కోర్టు జులై 7 వరకు రిమాండు విధించడంతో ఖాకీలు ఆయనను జైలుకు తరలించారు. అయితే ‘ ఎంచక్కా ‘ బెయిలుపై రిలీజయ్యాడు. ఇతని యవ్వారం వీడియోకెక్కి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కేసుపై హోమ్ మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్ బీజేపీ నాయకత్వం నుంచి నివేదిక కోరారు. అయితే ఆ రిపోర్ట్ ఆయనకు చేరేలోగానే ఆకాష్ వ్యవహారం ‘ సుఖాంత ‘మయింది.
ఆకాష్ దౌర్జన్యాన్ని ఖండించిన సీఎం కమల్ నాథ్.. క్రికెట్ బ్యాట్ ను ఈ దేశ విజయానికి ప్రతీకగా భావించాలిగానీ ప్రజాస్వామ్య ఓటమికి ప్రతీకగా కాదని వ్యాఖ్యానించారు.అయితే ఆశ్చర్యంగా చాలామంది ఈ ఎమ్మెల్యే కి మద్దతుగా నిలవడం విశేషం. ఇతని సపోర్టర్లు.. పోలీస్ స్టేషన్ బయట..సెల్యూట్ ఆకాష్ జీ అని రాసి ఉన్నపోస్టర్లను అతికించడంతో కొద్దిసేపటికి పోలీసులు వాటిని తొలగించారు. ఆకాష్ కి మద్దతు ప్రకటించిన 21 మంది మున్సిపల్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉండగా..మున్సిపల్ అధికారిని తాను క్రికెట్ బ్యాట్ తో కొట్టడాన్ని ఆకాష్ సమర్థించుకున్నాడు. ‘ ఆక్రమణలను తొలగిస్తున్నామన్న కారణంతో ఓ మహిళను పోలీసుల ముందే బలవంతంగా లాగినప్పుడు మరేం చేయాలి చెప్పండి ? నేను చేసిన పనికి చింతించడం లేదు. అయితే మళ్ళీ ఈ అవసరం రాకూడదనే ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా ‘ అన్నాడు ఆకాష్ మీడియాతో.