
బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీష్ కుమార్ మంగళవారం (ఏప్రిల్ 14, 2026) తన పదవికి రాజీనామా చేశారు. తన చివరి మంత్రివర్గ సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అదే సమయంలో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో బీహార్ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన తదుపతి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
57 ఏళ్ల సామ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరంగా సాగింది. ముంగేర్ జిల్లాకు చెందిన ఆయన, సమతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు శకునీ చౌదరి కుమారుడు. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సామ్రాట్, ఆరంభంలో ఆర్జేడీలో పనిచేశారు. 1999లోనే రబ్రీ దేవి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత జేడీయూలో చేరి జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2018లో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నాక ఆయన గ్రాఫ్ వేగంగా పెరిగింది. బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా కీలక పాత్రలు పోషించారు.
మంగళవారం (ఏప్రిల్ 14) పాట్నాలో జరిగిన పరిణామాల కోసం కేంద్రం ప్రత్యేక పరిశీలకులను పంపింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీఎల్ సంతోష్, వినోద్ తావ్డే వంటి అగ్రనేతల సమక్షంలో సామ్రాట్ చౌదరిని ఎన్డీఏ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి ఎన్డీయే నేతలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. “బీహార్ అభివృద్ధిని పరుగులు పెట్టించడమే మా లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది.” అని సామ్రాట్ చౌదరి అన్నారు.
సమ్రాట్ చౌదరి ఎన్నికతో బీహార్‌లో గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు తెరపడింది. బుధవారం (ఏప్రిల్ 15) లోక్‌భవన్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2000, 2010లో పర్బత్తా ఎమ్మెల్యేగా, 2025లో తారాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, ఇప్పుడు బీహార్ రాష్ట్ర అత్యున్నత పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఒకప్పటి లాలూ విధేయుడైన శకునీ చౌదరి వారసుడు, నేడు బీజేపీ తరపున ముఖ్యమంత్రి కావడం బీహార్ రాజకీయాల్లో పెను మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..