
బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో జరిగిన విషాదకర ఘటన మరోసారి మొబైల్ ఫోన్లు, ఇయర్‌ఫోన్ల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసేలా చేసింది. చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకుని, మొబైల్‌లో సంగీతం వింటూ.. రైల్వే ట్రాక్‌పై నడుస్తున్న 32 ఏళ్ల యువకుడు రైలు హారన్ వినలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జలాల్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కతిహార్-జోగ్బాని రైల్వే మార్గంలో మంగళవారం (జూన్ 23) చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జలాల్‌గఢ్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న 27, 28 నంబర్ గేట్ల మధ్య అశోక్ రిషి అనే యువకుడు ట్రాక్ వెంబడి నడుస్తున్నాడు. అదే సమయంలో కతిహార్ నుంచి జోగ్బాని వెళ్తున్న డౌన్ ప్యాసింజర్ రైలు నంబర్ 75753 వెనుక నుంచి వేగంగా వచ్చింది. లోకో పైలట్ పలుమార్లు హారన్ మోగించినప్పటికీ, ఇయర్‌ఫోన్లలో సంగీతం వింటున్న అశోక్‌కు ఆ శబ్దం వినిపించలేదు.
కొన్ని క్షణాల్లోనే రైలు అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు అతని శరీరం ఛిద్రమైపోయింది. అనంతరం రైలు డ్రైవర్ జలాల్‌గఢ్ స్టేషన్‌కు చేరుకుని అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు, రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో యువకుడి మొబైల్ ఫోన్ పూర్తిగా ధ్వంసమైపోవడంతో అతడిని గుర్తించడం మొదట కష్టమైంది. అయితే పగిలిపోయిన ఫోన్ నుంచి సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని మరో ఫోన్‌లో అమర్చి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. దీంతో మృతుడు దిగ్గి గ్రామానికి చెందిన అశోక్ రిషిగా గుర్తించారు.
సోమవారం అత్తమామల ఇంటికి వెళ్లిన అశోక్, మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియల అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన రైల్వే ట్రాక్‌ల సమీపంలో మొబైల్ ఫోన్లు, ఇయర్‌ఫోన్లు ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తు చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..