Bhupendra Patel: గుజరాత్‌ బీజేపీ శాసనసభా పక్ష నేతగా భూపేంద్ర పటేల్.. సోమవారం రెండోసారి సీఎంగా ప్రమాణం..

|

Dec 10, 2022 | 3:29 PM

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులన్నీ బ్రేక్‌ చేసి.. ఘన విజయం సాధించింది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు 156 స్థానాలు గెలిచి బీజేపీ చరిత్రక విజయాన్ని నమోదుచేసుకుంది.

Bhupendra Patel: గుజరాత్‌ బీజేపీ శాసనసభా పక్ష నేతగా భూపేంద్ర పటేల్.. సోమవారం రెండోసారి సీఎంగా ప్రమాణం..
Bhupendra Patel
Follow us on

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గత రికార్డులన్నీ బ్రేక్‌ చేసి.. ఘన విజయం సాధించింది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు 156 స్థానాలు గెలిచి బీజేపీ చరిత్రక విజయాన్ని నమోదుచేసుకుంది. ఈ క్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ పార్టీ లెజిస్లేచర్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూపేంద్ర పటేల్‌ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలంతా భూపేంద్ర పటేల్‌ను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో సోమవారం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. సమావేశం అనంతరం భూపేంద్ర పటేల్‌ గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. తమకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.

కాగా, గుజరాత్‌ బీజేపీఎల్‌పీ సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఫలితాల అనంతరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందు భూపేంద్ర పటేల్ మంత్రివర్గం శుక్రవారం అధికారికంగా రాజీనామా చేసింది. డిసెంబర్ 12న గాంధీనగర్‌లోని హెలిప్యాడ్ మైదానంలో జరిగే కార్యక్రమంలో భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు.

కాగా, ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా భూపేంద్ర పటేల్‌ను బీజేపీ ప్రకటించింది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 156 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 స్థానాల్లో గెలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..