
భారత్ ఇప్పుడు కేవలం స్టార్టప్‌ల దేశంగా మాత్రమే కాదు.. భవిష్యత్ టెక్నాలజీలకు కేంద్రంగా మారే దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా డీప్‌టెక్ రంగంలో భారతీయ యువ పారిశ్రామికవేత్తలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణగా బెంగళూరులో జరిగిన ‘భారత్ ఇన్నోవేట్స్ ఇన్వెస్టర్ షోకేస్’ నిలిచింది. భారత విద్యాశాఖ, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం దేశ డీప్‌టెక్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జూన్ 14 నుంచి 16 వరకు జరగనున్న ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’ సమ్మిట్‌కు ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల ముందు భారత డీప్‌టెక్ స్టార్టప్‌ల సామర్థ్యాన్ని ప్రదర్శించడమే దీని ప్రధాన ఉద్దేశం.
దేశవ్యాప్తంగా ఉన్న వందలాది సంస్థలలో నుంచి ప్రముఖ ఇన్వెస్టర్లు, పరిశ్రమ నిపుణులు కలిసి 24 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఎంపిక చేశారు. ఇవి సాధారణ యాప్‌లు లేదా సాఫ్ట్‌వేర్ కంపెనీలు కాదు. భవిష్యత్తును మార్చే సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేస్తున్న సంస్థలు. ఈ స్టార్టప్‌లు పనిచేస్తున్న రంగాలు చూస్తే భారత టెక్నాలజీ భవిష్యత్తు ఎంత వేగంగా మారుతోందో అర్థమవుతుంది. అంతరిక్ష ప్రయోగ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ విమానాలు, రక్షణ సాంకేతికత, సెమీకండక్టర్లు, 5జీ-6జీ కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, మహిళల ఆరోగ్య పరిష్కారాలు, అగ్రి బయోటెక్, క్లీన్ ఎనర్జీ, మెరైన్ రోబోటిక్స్, డిజిటల్ హెల్త్‌కేర్ వంటి కీలక రంగాల్లో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో 90 మందికిపైగా గ్లోబల్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీరి నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ 85 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉండటం విశేషం. దేశంలోని ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం స్టార్టప్‌లకు భారీ అవకాశాలను తెరిచింది. యాక్సెల్, పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, బెస్సెమర్ వెంచర్ పార్ట్నర్స్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, చిరాటే వెంచర్స్ వంటి సంస్థలు హాజరయ్యాయి.
భారత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ సౌమ్య గుప్తా మాట్లాడుతూ.. భారత ఆవిష్కరణ వ్యవస్థ ఇప్పుడు సాధారణ స్టార్టప్ ఎకానమీ నుంచి పరిశోధన ఆధారిత టెక్నాలజీ ఎకానమీగా మారుతోందని తెలిపారు. భారత యువతలో ఉన్న శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనా సామర్థ్యాన్ని ప్రపంచ పెట్టుబడులతో కలపడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రకటించిన ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌లో భాగంగా నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటివరకు భారత్ అంటే ఎక్కువగా కన్స్యూమర్ యాప్‌లు, ఈ-కామర్స్ స్టార్టప్‌లకే ప్రసిద్ధి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అధునాతన పరిశోధనలతో ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకున్న డీప్‌టెక్ సంస్థలు వేగంగా ఎదుగుతున్నాయి. ఇన్వెస్టర్లతో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో ప్రతి స్టార్టప్‌కు 10 నిమిషాల ప్రజెంటేషన్, 5 నిమిషాల ప్రశ్నోత్తర సెషన్ ఇచ్చారు. దీంతో టెక్నాలజీ సామర్థ్యం మాత్రమే కాదు.. భవిష్యత్ వ్యాపార అవకాశాలు, ప్రపంచ మార్కెట్లో విస్తరణ సామర్థ్యాన్ని కూడా ఇన్వెస్టర్లు అంచనా వేశారు.
జూన్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ‘భారత్ ఇన్నోవేట్స్ 2026’లో దాదాపు 120 భారత డీప్‌టెక్ సంస్థలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందుకు వెళ్లనున్నాయి. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, పాలసీ మేకర్లు, పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
‘స్టార్టప్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘నేషనల్ డీప్‌టెక్ స్టార్టప్ పాలసీ’, ‘జాతీయ విద్యా విధానం 2020’ వంటి కార్యక్రమాల ద్వారా భారత్ ఇప్పుడు పరిశోధన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరహా కార్యక్రమాలు భారత యువ శాస్త్రవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు ప్రపంచ మార్కెట్ల తలుపులు తెరుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచానికి టెక్నాలజీ శక్తిగా భారత్ ఎదగాలంటే.. ఇలాంటి డీప్‌టెక్ ఆవిష్కరణలే భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయి.
💡 Bharat Innovates Investor Showcase held in Bengaluru on 19th May.
24 of India's most promising deep-tech start-ups pitched to 90+ investors from 66 funds managing over $85 Bn in global Assets Under Management, across space, defence, biotech, semiconductors, quantum, robotics… pic.twitter.com/9buLsjQKgd
— Ministry of Education (@EduMinOfIndia) May 22, 2026