
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు నేడు గురువారం (ఫిబ్రవరి 12) దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. సుమారు 10 ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. స్కూళ్లు, కాలేజీల సెలవుపై ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అయితే, రవాణా ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటంతో చాలా చోట్ల విద్యాసంస్థలు మూసివేసే అవకాశం ఉంది. అత్యవసర సేవలు (ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు), మెడికల్ షాపులు, పాలు, న్యూస్ పేపర్ సప్లయ్, అగ్నిమాపక కేంద్రాలు, విమాన సర్వీసులు, ATMలు తెరిచి ఉంటాయి.
ఫిబ్రవరి 12న జరిగే ఈ సమ్మెలో కనీసం 30 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటారని ట్రేడ్ యూనియన్ల నేతలు చెబుతున్నారు. ఈ భారత్ బంద్ 600 కంటే ఎక్కువ జిల్లాల్లో ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు, వర్తక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ప్రభుత్వ విధానాలు ‘కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలంగా’ ఉన్నాయని వారు అంటున్నారు. ఈ భారత్ బంద్‌కు రైతు సంస్థలు, వ్యవసాయ రంగానికి చెందిన కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువజన సంఘాలు, ఇతర సంఘాల మద్దతు ఉందని యూనియన్ తెలిపింది.
భారత్ బంద్ ఎందుకంటే..?
కార్మికులు, రైతులు సంఘాలు కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును వెనక్కి తీసుకోవాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) బలోపేతం చేయాలంటున్నారు. దీంతో పాటు ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్ బంద్‌కు INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC వంటి అనేక 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఉమ్మడి సమ్మెను ప్రకటించింది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు ఆటోరిక్షా డ్రైవర్లతో పాటు బస్సు, కారు, లారీ డ్రైవర్లు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య, బ్యాంకింగ్, రవాణా, వ్యవసాయ రంగాల సేవలపై ఈ సమ్మె ప్రభావం పడే అవకాశముంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టిన 10 కేంద్ర కార్మిక సంఘాలకు సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు మద్దతు పలికాయి. సార్వత్రిక సమ్మెలో 30 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయని, ఉద్యోగాల తొలగింపు సులభం చేస్తాయని, సామాజిక భద్రత తగ్గిస్తాయని ఆరోపిస్తున్నారు.
ఇండియా-యూఎస్ ఇంటరిమ్ ట్రేడ్ డీల్ లో వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపు, యూఎస్ దిగుమతులు పెరగడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్య ఒప్పందం నుంచి తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ, ముసాయిదా విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ వంటి వివిధ డిమాండ్లను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగుతున్నారు. విక్షిత్ భారత్ – రోజ్‌గార్ అజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం, 2025 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..