
బెంగళూర్‌లో దారుణం జరిగింది. ఆరు సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన ఓ నిందితుడు, ప్లాస్టిక్ తాడుతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డుపక్కన ఉన్న డ్రెయిన్‌లో పడేశాడు. సోమవారం సాయంత్రం కిడ్నాప్ అయిన బాలిక, అదే రాత్రికి హత్యకు గురైంది. బాలిక కిడ్నాప్ కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మెయిన్ రోడ్డుపక్కన ఉన్న ఫుట్‌పాత్ డ్రెయిన్ వద్ద కీలక ఆధారం లభించింది. అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్ సంచిని పరిశీలించి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఆరు సంవత్సరాల బాలికను హత్య చేసిన నిందితుడు, ఆమె మృతదేహాన్ని సంచిలో పెట్టి డ్రెయిన్‌లో పడేసి పరారయ్యాడు.
ఈ ఘటన వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లూరహళ్లి ప్రాంతంలో జరిగింది. ఆరు సంవత్సరాల బాలిక డ్రెయిన్‌లో మృతదేహంగా లభించింది. ఆమె పేరు షహబాజ్ ఖతూన్. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన షహబాజ్ కుటుంబం ఏడాది క్రితం బెంగళూరుకు వలస వచ్చింది. అదే ప్రాంతంలోని పక్కపక్క భవనాల్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సుపర్ణా బేగం – ఇంజాముల్ షేక్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను తాతమ్మల వద్ద ఉంచి, చిన్న కుమార్తెను బెంగళూరుకు తీసుకొచ్చారు.
ఐదో తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఎప్పటిలాగే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా, తల్లి నిద్రపోయింది. మేలుకుని చూసేసరికి బాలిక కనిపించలేదు. అన్ని చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు.
ఇదే సమయంలో పక్కింటి వ్యక్తి యూసఫ్ యాకూంతో తరచూ గొడవలు జరుగుతుండేవని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు కూడా కనిపించకపోవడంతో, అతడే కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూసఫ్ యాకూం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..