బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జనవరి 10వ తేదీన షాకింగ్ సంఘటన జరిగింది. ప్రయాణికులు బస్సులోనే వేచి ఉండగానే విమానం మాత్రం గాలిలో ఎగిరిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు అరుపులు కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. గ్రౌండ్ స్టాఫ్, సిబ్బంది మధ్య పొరపాటు కారణంగా పెద్ద పొరపాటే జరిగింది. ఈ కారణంగా విమానం కోసం ఎదురు చూస్తున్న 54 మంది ప్రయాణికులను వదిలి ఢిల్లీకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో 54 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. అయితే, విమానయాన సంస్థ తన తప్పును అంగీకరించి ప్రయాణికులందరినీ మరో విమానంలో ఢిల్లీకి పంపించింది. దీనిపై డీజీసీఏ నివేదిక కోరినట్లు తెలుస్తున్నది. అయితేఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. విమానం గాలిలో ఎగిరిపోయిన విషయం గ్రౌండ్ సిబ్బందికి కూడా తెలియదంట.
నివేదిక ప్రకారం, బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 5.45 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ సమయంలో గో ఫస్ట్ ఫ్లైట్ G8 116 బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రయాణికులను తీసుకెళ్లాల్సి ఉంది. టెర్మినల్‌లో ప్రయాణీకులను విమానానికి తీసుకెళ్లేందుకు మొత్తం నాలుగు బస్సులను అద్దెకు తీసుకున్నారు. రెండు బస్సల్లో వచ్చిన ప్రయాణికులు విమానంలోకి ఎక్కి తమతమ సీట్లలో కూర్చున్నారు. మూడు, నాలుగు బస్సులు మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుతాయనగా.. విమానం గాల్లోకి ఎగిరింది. దాంతో బస్సుల్లో వస్తున్న 54 మంది ప్రయాణికులు అవాక్కయ్యారు. తామంతా ఇంకా ఫ్లయిట్ ఎక్కకుండానే ఎలా విమానాన్ని ఎగరనిస్తారని వారు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. దాంతో గోఫస్ట్ ఎయిర్‌వేస్ అధికారులు 4 గంటల అనంతరం మరో విమానాన్ని తెప్పించి వారిని గమ్యస్థానం చేర్చారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న డీజీసీఏ.. నివేదిక అందజేయాలని ఎయిర్‌పోర్ట్ అధికారులను ఆదేశించింది. నివేదిక ఆధారంగా కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి