
మీడియా రంగంలో ఎవరికీ అందని ఎత్తులో దూసుకుపోతున్న టీవీ9 నెట్‌వర్క్ కీర్తి కిరీటంలోకి మరో మణిహారం వచ్చి చేరింది. లండన్‌లో జరిగిన డబ్ల్యూసీఆర్‌సీ లీడర్స్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు టీవీ9 నెట్‌వర్క్‌ను వరించాయి. న్యూస్ మీడియా రంగంలో టీవీ9 నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బరుణ్ దాస్ చేసిన కృషికి, ఆయన చేసిన సేవలకు మెచ్చి.. ‘వరల్డ్స్ బెస్ట్ లీడర్’ అవార్డును అందించారు. అలాగే టీవీ9 న్యూస్ ఓటీటీ ఫ్లాట్‌ఫారమ్ ‘News9 Plus’కు 2023కు గానూ ‘వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్’ అవార్డు లభించింది. ఈ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం లండన్‌లోని లార్డ్స్‌లో ప్యాలస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్‌లో వరల్డ్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్(డబ్ల్యూసీఆర్‌సీ) ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటన్ రాజకీయ నేతలైన సందీప్ వెర్మ, పోలా ఉద్దిన్ చేతుల మీదగా ‘వరల్డ్ బెస్ట్ లీడర్’ అవార్డును అందుకున్నారు బరుణ్ దాస్.
‘న్యూస్ నెట్‌వర్క్‌ని నడపడం సవాల్‌తో కూడుకున్న పని. ఇక్కడ ఇంకా అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే.. మీడియా(న్యూస్ ఛానెల్)ను అందరూ కూడా ఫోర్త్ ఎస్టేట్‌గా భావిస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని నడిపిస్తూ.. ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా ఉండే బాధ్యతను కూడా సమతుల్యంగా నిర్వర్తించడం పెద్ద సవాల్. ఒకవైపు మా కార్యకలాపాలు కొనసాగేందుకు లాభాలు ఆర్జించడంతో పాటు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ.. నిజాలను ప్రజల వరకు చేర్చేందుకు కృషి చేసే అర్హులైన జర్నలిస్టులకు తగిన గుర్తింపును అందించడమే కాకుండా.. వారిని అవార్డులు, రివార్డులతో సత్కరించాలి. ఇలా ప్రతీ ఒక్క విషయం.. మా బాధ్యతలను ఎప్పటికప్పుడు మాకు గుర్తు చేస్తుంటాయి. మంచి టీం ఉంటేనే.. లీడర్ అనేవాడు గొప్పవాడవుతాడు. ఇంతటి పెద్ద సమ్మిట్‌లో నా టీంకు ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినందుకు WCRCకి కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు బరుణ్ దాస్.
‘వరల్డ్స్ బెస్ట్ లీడర్’ 2023 అవార్డుతో టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్.. అసధరమైన నాయకుల చెంతకు చేరిపోయారు. తన అసమానమైన నాయకత్వ నైపుణ్యాలతో.. తన సంస్థలకు ఎన్నో అపురూపమైన విజయాలను అందించి.. శిఖరానికి చేర్చారు. ఆయన వినూత్న వ్యూహాలు, గొప్ప మేధాశక్తి తన స్వంత సంస్థకు ఎంతగానో లాభాలను, పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టడమే కాకుండా.. మీడియా రంగంలో కూడా చెరగని ముద్ర వేసింది. మరోవైపు న్యూస్9 ప్లస్ ఓటీటీకి, మీడియా పరిశ్రమ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్స్ 2023’ అవార్డు దక్కింది. పాత్రికేయ సమగ్రత, నాణ్యమైన రిపోర్టింగ్‌పై అచంచలమైన నిబద్ధతను.. సమయానుకూల వార్తల కవరేజీను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ.. అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.