Bandi Sanjay: అతిపెద్ద మంచినీటి సరస్సును సందర్శించిన బండి సంజయ్.. అభివృద్ధిపై హామీ..

బండి సంజయ్ ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం ఉన్న లోక్ తక్ సరస్సును సందర్శించారు. దేశంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు అయిన లోక్ తక్ విశేషాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరస్సు అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు పంపితే కేంద్రం సహాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Bandi Sanjay: అతిపెద్ద మంచినీటి సరస్సును సందర్శించిన బండి సంజయ్.. అభివృద్ధిపై హామీ..
Band Sanjay Kumar Visits Loktak Lake

Edited By: Krishna S

Updated on: Nov 05, 2025 | 10:53 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన మణిపూర్ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లోక్ తక్ సరస్సును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సరస్సు విశేషాలను పరిశీలించి, అభివృద్ధి ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుంచి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి బోట్‌లో అరగంట పాటు సరస్సులో పర్యటించిన మంత్రి, అధికారుల నుంచి లోక్ తక్ విశేషాలను తెలుసుకున్నారు.

లోక్ తక్ సరస్సు విశేషాలు

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 48 కి.మీ.ల దూరంలో బిష్ణుపూర్ జిల్లాలో ఈ సరస్సు ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు. సుమారు 250 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. లోక్ తక్ సరస్సు ఫుం‌దిస్‌ అని పిలువబడే తేలియాడే దీవులకు ప్రసిద్ధి. ఈ ఫుం‌దిస్‌ వృక్షజాలం, నేల, సేంద్రియ పదార్థాలతో ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్న కైబుల్ లామ్జో జాతీయ ఉద్యానవనం, ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం కావడం విశేషం. మణిపూర్ రాష్ట్ర జంతువు అయిన సంగై జింకకు ఈ సరస్సు నివాస స్థలం. ఈ సరస్సులో 100 కంటే ఎక్కువ రకాల పక్షులు, 200 కంటే ఎక్కువ రకాల జల వృక్షాలు ఉన్నాయి.

జీవనాధారం, అభివృద్ధిపై సమీక్ష

ఈ మంచినీటి సరస్సు వేలాది మంది స్థానిక మత్స్యకారులు, రైతులకు జీవనాధారం. నీటిపారుదల, తాగునీరు, అలాగే లోక్తక్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి దీనిని ఉపయోగిస్తున్నారు. లోక్ తక్ ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణ పర్యాటక కేంద్రమైనప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. సరస్సు అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని కోరారు. కేంద్రంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

లోక్ తక్ సందర్శన అనంతరం.. బండి సంజయ్ చుర్ చాంద్ పూర్ జిల్లా అభివృద్ధి, స్థానిక సమస్యలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. గ్రామాల నుండి జిల్లా కేంద్రం, రాజధాని వరకు రవాణా సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్య అని, దీనిపై దృష్టి సారించాలని మంత్రిని కోరారు. చుర్ చాంద్ పూర్ సహా మణిపూర్ అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోందని.. తగిన ప్రతిపాదనలు పంపితే తగిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..