రామమందిర ట్రస్ట్‌లో కొత్త అధ్యాయం.. CEO నియామకం, కమిటీల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్

Ram Janmabhoomi Trust: అయోధ్య శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జూలై 22న కీలక సమావేశం జరగనుంది. కొత్త CEO, ప్రధాన కార్యదర్శి నియామకంతో పాటు కమిటీల పునర్వ్యవస్థీకరణ, విరాళాల భద్రతకు కొత్త నిబంధనలు, సిట్ నివేదికపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రామమందిర ట్రస్ట్‌లో కొత్త అధ్యాయం.. CEO నియామకం, కమిటీల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్
Ayodhya Ram Mandir Trust

Edited By:

Updated on: Jul 12, 2026 | 4:19 PM

Ayodhya Ram Mandir: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలోని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో పరిపాలనా పరంగా కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇటీవల ఆలయ విరాళాల లెక్కింపులో జరిగిన చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, ట్రస్ట్ తన వ్యవస్థను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా మార్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా జూలై 22వ తేదీన ఒక అత్యవసర, కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో కమిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్త ప్రధాన కార్యదర్శి, సీఈఓ (CEO) నియామకాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ట్రస్ట్ తాత్కాలిక జనరల్ సెక్రటరీ డాక్టర్ కృష్ణ మోహన్ ఇప్పటికే ట్రస్టీలందరికీ ఈ సమావేశానికి సంబంధించిన అధికారిక నోటీసులను పంపారు. జూలై 22న మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రత్యేక సమావేశం, ఆ తర్వాత సాయంత్రం 4:00 గంటలకు మణి రామ్ దాస్ కంటోన్మెంట్‌లో ప్రధాన సమావేశం జరగనుంది.

కమిటీల పూర్తి ప్రక్షాళన

ప్రస్తుతం ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేసి, నూతన పద్ధతిలో విధులను విభజించనున్నారు. ట్రస్ట్‌లో ఖాళీగా ఉన్న మూడు కీలక పదవులను భర్తీ చేయనున్నారు. విరాళాల వివాదం నేపథ్యంలో మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజా బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణంతో మరో ట్రస్టీ పదవి ఖాళీగా ఉంది. ఈ మూడు స్థానాలకు కొత్త సభ్యులను ఎన్నుకోవడంతో పాటు, తాత్కాలికంగా బాధ్యతలు చూస్తున్న డాక్టర్ కృష్ణ మోహన్‌ను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది. అలాగే, ఆలయ రోజువారీ పరిపాలనను ప్రొఫెషనల్‌గా నిర్వహించడానికి ట్రస్ట్ చరిత్రలోనే తొలిసారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)ను కూడా నియమించబోతున్నారు. జూలై 18 వరకు అర్హులైన అభ్యర్ధులు సీఈఓ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా సీఈఓ ఎంపిక చేసి జూలై 22 న కమిటి సమావేశం సందర్భంగా సీఈఓ ను ప్రకటించే అవకాశం ఉంది.

విరాళాల భద్రతకు కొత్త నిబంధనలు

ఆలయ హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియలో పర్యవేక్షణ లోపాలు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక విచారణలో గుర్తించడంతో భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు వివిధ ప్రముఖ బ్యాంకులతో సంప్రదింపులు జరిపి, ఒక కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) తీసుకురానున్నారు. కొత్తగా నోట్ల లెక్కింపు సిబ్బందిని నియమించడం, నిఘా పెంచడం, భద్రతను మరింత కఠినతరం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

ఇవి కూడా చదవండి

సిట్ తుది నివేదికపై చర్చించే అవకాశం!

విరాళాల చోరీ కేసును విచారిస్తున్న సిట్ (SIT) తన తుది నివేదికను జూలై 22 లోపు ట్రస్ట్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణీత సమయానికి నివేదిక అందితే, ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై ట్రస్ట్ సభ్యులు చర్చించనున్నారు. మొత్తానికి జూలై 22న జరగబోయే ఈ భేటీ అయోధ్య రామమందిర భవిష్యత్తు పరిపాలనా విధానాన్ని మార్చే కీలక మలుపు కానుంది.

Follow Us