Ayodhya Ram Mandir Inauguration Live: స్వర్ణాభరణాలతో కొలువు తీరిన అయోధ్య రామయ్య.. 500 యేళ్లనాటి కల సాకారం

| Edited By: Ram Naramaneni

Jan 22, 2024 | 3:37 PM

Ayodhya Ram Mandir Pran Pratishtha Live: మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్‌లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. స్వామివారికి ప్రధాని మొదటి హారతి సమర్పించారు. అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది.

Ayodhya Ram Mandir Inauguration Live: స్వర్ణాభరణాలతో కొలువు తీరిన అయోధ్య రామయ్య.. 500 యేళ్లనాటి కల సాకారం
Ayodhya Ram Mandir Inauguration

అయోధ్య, జనవరి 22: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. గర్భగుడిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన ఘట్టం పూర్తయింది. ప్రధాని మోదీ, RSS చీఫ్‌ మోహన్‌ భగవత్ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలరాముడికి నేత్రాలంకారం చేశారు ప్రధాని మోదీ. రామ్‌లలాకు పట్టువస్త్రాలు, పీతాంబరం, పాదుకలు, ఛత్రం సమర్పించారు.  అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకన్ల పాటు రామ్‌లలా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. బాల రాముడి ముగ్ద మనోహర రూపాన్ని చూసి తరలించారు ప్రముఖులు. ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాన కర్తగా ఉన్నారు మోదీ.

బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్, CM యోగి ప్రత్యేక పూజలు చేశారు. అద్భుత ఘట్టం వేళ ఆలయం రామనామ స్మరణతో మార్మోగింది.  బాలరాముడికి తొలి హారతి ఇచ్చారు ప్రధాని మోదీ. RSS చీఫ్‌తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ బాలరాముడికి హారతి ఇచ్చారు. స్వర్ణాభరణాలతో ఉన్న బాలరాముడిని కన్నులారా చూసి తరించారు.  బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత గర్భాలయంపై పూల వర్షం కురిసింది. హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించారు. అటు అపూర్వ ఘట్టం వేళ ప్రధాన ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jan 2024 03:03 PM (IST)

    రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం: ప్రధాని మోదీ

    “ఇవాళ దేశంలో నిరాశావాదానికి చోటు లేదు. ఉన్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలి. దేవ్‌ సే దేశ్‌.. రామ్‌ సే రాష్ట్ర్‌.. ఇదే మన కొత్త నినాదం. పరాక్రమవంతుడు రాముడిని నిత్యం పూజించాలి. భవిష్యత్తులో మనం అనేక విజయాలు సాధించాలి. రాముడు అగ్ని కాదు.. రాముడు వెలుగు. రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం. ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు.. భారత విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ. ఇది కేవలం ఆలయమే కాదు.. భారత చైతన్యానికి ప్రతీక. రాముడే భారత్ ఆధారం.. రాముడే భారత్‌ విధానం. రాముడే విశ్వం.. రాముడే విశ్వాత్మ. రాముడే నిత్యం.. రాముడే నిరంతరం. త్రేతాయుగం నుంచి ఇప్పటివరకు రాముడిని ఆరాధిస్తున్నాం. రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి. మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఈ క్షణం.. దేశప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఈ క్షణం.. మన విజయానికే కాదు.. వినయానికి కూడా సూచిక. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. పవిత్రత, శాంతి, సామరస్యం.. భారత ఆత్మకు ప్రతిరూపం. వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. అత్యున్నతమైన ఆదర్శ వ్యక్తికి ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది సాధారణ మందిరం కాదు.. దేశ చైతన్యానికి ప్రతీక. రాముడు మనదేశ ఆత్మ.. ధైర్యసాహసాలకు ఆయన ప్రతిరూపం”

  • 22 Jan 2024 02:36 PM (IST)

    రామనామం.. ఈ దేశప్రజల కణకణంలో నిండి ఉంది: ప్రధాని మోదీ

    “ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంది. పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నా. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారు. న్యాయస్థానాల తీర్పు తర్వాతే మన కల సాకారమైంది. ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటోంది. ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించా. ఏపీలోని లేపాక్షిలో ప్రత్యేక పూజలు నిర్వహించా. సాగర్‌ నుంచి సరయూ వరకు రామనామం జపించా. రామనామం.. ఈ దేశప్రజల కణకణంలో నిండి ఉంది” అని ప్రధాని పేర్కొన్నారు.

  • 22 Jan 2024 02:33 PM (IST)

    2024 జనవరి 22.. సాధారణ తేదీ కాదు.. కొత్త కాలచక్రానికి ప్రతీక: ప్రధాని మోదీ

    “మన రాముడు మళ్లీ వచ్చాడు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు వచ్చాడు.మన బాలరాముడు ఇక నుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. గర్భగుడిలో ఇప్పుడే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాం.రామభక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. మన రామ్‌ లల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడు. 2024 జనవరి 22.. సాధారణ తేదీ కాదు.. కొత్త కాలచక్రానికి ప్రతీక” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

  • 22 Jan 2024 02:31 PM (IST)

    రాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక: మోహన్‌ భాగవత్‌

    “రాముడిని కోట్ల గళాలు స్మరించాయి. రాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక. రాముడి త్యాగానికి, పరిశ్రమకు నమస్సులు.పేదల సంక్షేమానికి కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది. సమన్వయం చేసుకుని ముందుకెళ్లడమే మన ధర్మం” అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.

  • 22 Jan 2024 02:27 PM (IST)

    ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైంది: యోగి ఆదిత్యనాథ్‌

    “500 ఏళ్ల కల నెరవేరింది. ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లు ఎదురుచూసింది. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైంది. ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారింది. ఈ అద్భుత ఘట్టాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇదంతా సాధ్యమైంది. అయోధ్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు రూ.వందల కోట్లు కేటాయించారు.”

  • 22 Jan 2024 01:45 PM (IST)

    ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కు సీఎం యోగి కానుకలు

    ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌లకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక కానుకలు సమర్పించారు. అయోధ్య ఆలయ ఆకృతిని ప్రతిబింబించే బహుమతులు అందజేశారు.

  • 22 Jan 2024 01:39 PM (IST)

    చిరంజీవి కుటుంబ సభ్యులను కలిసిన పీటీ ఉష

    PT Usha with Chirangeevi Family

    అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సినీనటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, వారి కుమారుడు రామ్‌చరణ్‌ హాజరయ్యారు. అయోధ్యలో చిరంజీవి కుటుంబ సభ్యులను పీటీ ఉష మర్యాదపూర్వకంగా కలిశారు.

  • 22 Jan 2024 01:15 PM (IST)

    కన్నుల పండువగా పూర్తైన బాలరాముడి ప్రాణప్రతిష్ట

    ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బంగారు బాణం, నుదుటిన వజ్రనామం, వజ్రాలు – పగడాలు పొదిగిన బంగారాభరణాలు, తలపై వజ్రవైడుర్యాలు పొదిగిన కిరీటం, మెడలో రత్నాల కాసుల హారం, పాదాల వద్ద బంగారు కమల పుష్పాలు.. బాల రాముడిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదు. బాలరాముడి దర్శనంతో భారతావని పులకించింది.

  • 22 Jan 2024 01:04 PM (IST)

    రామ్‌లల్లాకు తొలి హారతి ఇచ్చిన ప్రధాని మోదీ

    అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంబరాన్నంటింది. 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రామయ్యకు తొలి హారతి ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆకాశం నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు.

  • 22 Jan 2024 12:54 PM (IST)

    స్వర్ణాభరణాలతో దర్శనమిచ్చిన బాలరాముడు

    Ayodhya Ram Mandir

    స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాలరాముడి దర్శనం భక్త కోటిని పులకరింప చేసింది. టీవీల్లో ప్రసారమైన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి యావత్‌ ప్రపంచం పరవశించింది.

  • 22 Jan 2024 12:42 PM (IST)

    నెరవేరిన 500 యేళ్లనాటి కల.. అయోధ్యలో కొలువు తీరిని బాల రాముడు

    అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్రృతమైంది. మోదీ చేతుల మీదుగా శాస్త్రోక్తంగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరిగింది.

  • 22 Jan 2024 12:36 PM (IST)

    ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణప్రతిష్ట

    • Ayodhya Ram Mandir

    • అయోధ్యలో కొలువు తీరిని బాలరాముడు
    • అబిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి
    • వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు మధ్య ప్రాణప్రతిష్ట
    • అయోధ్యా రామాలయంపై హెలికాఫ్టర్‌తో పూల వర్షం
  • 22 Jan 2024 12:29 PM (IST)

    గర్భగుడిలో మోదీ, RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌

    మరికొన్ని నిమిషాల్లో 500 యేళ్ల నాటి కల సాకారం కానుంది. అయోధ్యలో ప్రధాని మోదీ, RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌ గర్భగుడిలో పూజలు చేస్తున్నారు. కాటుక దిద్ది రాముడికి మోదీ నేత్రాలంకారం చేశారు.

  • 22 Jan 2024 12:22 PM (IST)

    ప్రారంభమైన ప్రాణప్రతిష్ట క్రతువు.. రామయ్యకు పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించిన మోదీ

    అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. రామనామ స్మరణతో అయోధ్య మారుమ్రోగుతోంది.

  • 22 Jan 2024 12:14 PM (IST)

    అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రధాని మోదీ పూజలు

    PM Modi

    అయోధ్యంలో అపూర్వ ఘట్టం ప్రారంభమైంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పూజాది కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరుగుతోంది

  • 22 Jan 2024 12:10 PM (IST)

    అయోధ్యకు చేరుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ

    రామ జన్మభూమికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ చేరుకున్నారు. గౌతమ్‌ అదానీ, అనిల్‌ అంబానీ కూడా శ్రీరామ ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరయ్యారు.

  • 22 Jan 2024 12:08 PM (IST)

    అయోధ్య రామాలయానికి చేరుకున్న సచిన్‌ టెండుల్కర్‌

    బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం అయోధ్యకు సచిన్‌ టెండుల్కర్‌ చేరుకున్నారు. అయోధ్యలో వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, సంగీతం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, చినజీయర్‌ స్వామీ కూడా విచ్చేశారు.

  • 22 Jan 2024 11:43 AM (IST)

    7 వేల అతిథులతో సందడిగా అయోధ్య రాయాలయం

    Celebrities

    సినీ, మీడియా, రాజకీయ రంగాలకు చెందిన దాదాపు 7 వేల అతిథులు చేరుకోవడంతో అయోధ్యా రాయాలయం సెలబ్రెటీలతో సందడిగా మారింది. హనుమాన్‌గర్హిలో నటుడు అనుపమ్ ఖేర్ పూజలు చేస్తూ కనిపించిన చిత్రాలు ఈ రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

  • 22 Jan 2024 11:42 AM (IST)

    50కిపైగా దేశాల్లో ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం

    ప్రపంచవ్యాప్తంగా రామనామ జపం మారుమ్రోగుతోంది. 50 వేలకు పైగా దేశాల్లో శ్రీరామ ప్రాణప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమం ప్రత్యక్షప్రసారం కానుంది.

  • 22 Jan 2024 11:22 AM (IST)

    ప్రపంచవ్యాప్తంగానూ అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం

    ఇవాళ ప్రాణప్రతిష్ఠ చేస్తున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ఇప్పటివరకూ పూజలందుకున్న విగ్రహం నిన్ననే ఆలయంలోకి తరలించారు. ప్రపంచవ్యాప్తంగానూ అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట లైవ్‌లు ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత మ.1.15 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో శోభాయాత్రలు జరుగుతున్నాయి.

  • 22 Jan 2024 11:19 AM (IST)

    12:29:08 నుంచి 12:30:32 సెకన్ల వరకూ ముహూర్తం

    లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనంతో అయోధ్యానగరి కిక్కిరిసింది. రాజకీయ దిగ్గజాలు, అమితాబ్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తరలివచ్చారు. 12:29:08 నుంచి 12:30:32 సెకన్ల వరకూ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం ఫిక్స్‌ చేశారు.

  • 22 Jan 2024 11:16 AM (IST)

    అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

    అయోధ్య విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. మధ్యాహ్నం 12.05 నుంచి 12.55 వరకూ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అతిథులు తరలివచ్చారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, రామనామ స్మరణతో మార్మోగుతున్న అయోధ్య.

  • 22 Jan 2024 11:14 AM (IST)

    అయోధ్యకు చేరుకున్న సినీనటుడు చిరంజీవి, రజనీకాంత్

    రజనీకాంత్‌, చిరంజీవి, రామ్‌ చరణ్‌, పవన్‌ కళ్యాణ్‌, అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మాదురీ దీక్షిత్‌, కత్రినా కైఫ్‌, కంగనారనౌత్‌, విక్కీకౌశల్ తదితర సినీనటులు అయోధ్య రామాలయానికి చేరుకున్నారు.

  • 22 Jan 2024 11:11 AM (IST)

    అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

    అయోధ్యకు ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపట్లో 500 యేళ్ల నాటి కల నెరవేరనుంది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. 12.5 గంటలకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు మోదీ ప్రసంగించనున్నారు.

  • 22 Jan 2024 11:00 AM (IST)

    మరికాసేపట్లో రామజన్మభూమికి చేరుకోనున్న ప్రధాని మోదీ

    • ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ రాక.. దాదాపు 4 గంటలు అయోధ్య రామయ్య సన్నిధిలో మోదీ
    • ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ రామజన్మభూమికి చేరుకుంటారు
    • ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత భక్తులనుద్దేశించి మోదీ ప్రసంగం
    • మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయోధ్యలోని కుబర్‌ తిలాలోని శివ మందిర్‌ సందర్శన
    • మధ్యాహ్నం 3.30 గంటలకు మోదీ ఢిల్లీ ప్రయాణం
  • 22 Jan 2024 10:54 AM (IST)

    84 సెకన్ల అభిజిత్‌ లగ్నంలో ప్రాణప్రతిష్ట క్రతువు

    కోట్లాది భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న మధుర క్షణాలు ఆసన్నమయ్యాయి. మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 2.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే అభిజిత్‌ లగ్నంలో ఈ వేడుక జరగనుంది. ప్రాణప్రతిష్ఠను 84 సెకన్ల దివ్య ముహూర్తంలో నిర్వహించాలని నిర్ణయించారు. విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా ఉన్న వస్త్రాన్ని మోదీ తొలగించి, బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దుతారు. ఆ తర్వాత రామయ్యకు చిన్న అద్దాన్ని చూపిస్తారు. అనంతరం 108 దీపాలతో ‘మహా హారతి’ ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది.

  • 22 Jan 2024 10:47 AM (IST)

    అయోధ్య రామాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబు

    అయోధ్య రామాలయం వద్దకు చేరుకున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు.

  • 22 Jan 2024 10:19 AM (IST)

    బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు బయల్దేరిన సినీతారలు..

    బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను కనులారా వీక్షించేందుకు రజనీకాంత్‌, అనుపమ్‌ ఖేర్‌ అయోధ్యకు చేరుకున్నారు. మరోవైపు చిరంజీవి, రామ్‌చరణ్‌, పవన్‌కల్యాణ్‌, విక్కీ కౌశల్‌, కత్రినాకైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, రోహిత్‌ శెట్టి.. వంటి తదితర సినీ ప్రముఖులు అయోధ్యకు బయలు దేరారు.

  • 22 Jan 2024 10:14 AM (IST)

    దేశ రాజధానిలోనూ భారీ భద్రత

    దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పలు ఆలయాలు, మార్కెట్లలో బహుళ అంచెల భద్రత కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా హోటళ్లు, అతిథి గృహాలు, ధర్మశాలల్లో పోలీసులు గస్తీ కాస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

  • 22 Jan 2024 10:13 AM (IST)

    400 కిలోల బాహుబలి తాళం.. 2,100 కిలోల గంట

    400 Kg Bahubali Lock And Loddu

    అయోధ్య రామాలయానికి 1,265 కిలోల భారీ లడ్డూ చేరుకుంది. అయోధ్య రామాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలు పంపిణీ చేసింది. అలీగఢ్‌ నుంచి అయోధ్య రామాలయానికి 400 కిలోల బాహుబలి తాళం కానుకగా వచ్చింది. అష్టధాతువులతో తయారైన భారీ గంటను కూడా తీసుకొచ్చారు. బంగారం, వెండి, రాగి, జింక్‌, సీసం, టిన్‌, ఇనుము, పాదరసంతో దాదాపు 2,100 కిలోల గంట ఈ రోజు రామాలయంలో ఏర్పాటు చేస్తారు.

  • 22 Jan 2024 10:05 AM (IST)

    ఆధ్యాత్మిక నగరిలో మూడంచెల భద్రత.. డ్రోన్లతో పటిష్ట నిఘా

    అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్‌) కూడా గస్తీలో పాల్గొననుంది. ప్రముఖులు ప్రయాణించే రోడ్లలో పటిష్ట ట్రాఫిక్‌ నియంత్రణ ఏర్పాటుచేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ధర్మపథ్‌, రామ్‌పథ్‌ ప్రాంతాల నుంచి హనుమాన్‌గఢీ, అషర్ఫీ భవన్‌ వీధుల్లో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాల సహాయంతో సరయు నది పొడవునా భద్రతను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డ్రోన్ల తోనూ నిఘా ఏర్పాటు చేశారు. యూపీ పోలీసులు, ఏటీఎస్‌ కమాండోలు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు భారీ సంఖ్యలో మోహరించాయి. 10 వేలకు పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా, అయోధ్యకు వెళ్లే అన్నిమార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.

  • 22 Jan 2024 09:36 AM (IST)

    ముగ్గురు శిల్పులు.. మూడు శిల్పాలు.. కానీ ఒకటే ఎంపిక

    అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించేందుకు ముగ్గురు శిల్పులు చెక్కిన మూడు విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన ప్రతిమను అంతిమంగా ఎంపిక చేశారు. అయితే మిగతా రెండింటిని కూడా ఆలయంలోనే ఉంచనున్నట్లు ఆలయ ట్రస్‌ పేర్కొంది. వాటిలో ఒకదాన్ని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరో ఏడు ఉపాలయాలు నిర్మించాల్సి ఉందని, ప్రాణ ప్రతిష్ట అనంతరం జనవరి 23 నుంచే మళ్లీ నిర్మాణపనులను ప్రారంభం అవుతాయని రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు.

  • 22 Jan 2024 09:31 AM (IST)

    ‘ఆలయ నిర్మాణం ఈ ఏడాదిలోనే పూర్తి.. మరో రూ.300 కోట్లు అవసరం’ ఆలయ ట్రస్ట్

    అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకు పైగా ఖర్చయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌దేవ్‌ గిరి వెల్లడించారు. మందిర పూర్తి నిర్మాణం ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామన్నారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని ఆయన తెలిపారు.

  • 22 Jan 2024 09:29 AM (IST)

    అయోధ్య గర్భగుడిలోకి పాత రామ్‌లల్లా మూర్తి

    అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పాత రామ్‌లల్లా విగ్రహాన్ని కూడా ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు సోమవారం కొత్తగా ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ముందే ఈ విగ్రహం ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌దేవ్‌ గిరి తెలిపారు. పాత విగ్రహం అయిదారు అంగుళాల ఎత్తు ఉంటుంది. 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి కూడా ఈ విగ్రహం స్పష్టంగా చూడలేం. అందుకే 51 అంగుళాల కొత్త మూర్తి ప్రతిష్టిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాత రామ్‌లల్లా మూర్తి ఇన్నళ్లూ తాత్కాలిక మందిరంలో ఉన్న సంగతి తెలిసిందే.

  • 22 Jan 2024 09:06 AM (IST)

    అయోధ్యలో అట్టహాసంగా జానపద నృత్యాల ప్రదర్శన

    Ayodhya Ram Mandir

    ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు వేళయింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్యలోని ధర్మ మార్గంలో వివిధ వేదికలపై కళాకారులు జానపద నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. ఆ నృత్యాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు వివిధ జానపద నృత్యాలు ప్రదర్శిస్తున్నారు.

  • 22 Jan 2024 09:04 AM (IST)

    మరికొద్దిగంటల్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ

    అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఈ రోజు మధ్యాహ్నం 12.29కి అభిజిత్‌ లగ్నంలో మొదలవుతుంది. 84 సెకన్లపాటు రామ్‌లలా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని మోదీ ఉదయం 10:25 గంటలకి అయోధ్య చేరుకోనున్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం మధ్యాహ్నం 1.15కి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

  • 22 Jan 2024 08:31 AM (IST)

    అయోధ్య రామయ్యకు ముత్యాల గజమాల బహుకరించిన హైదరాబాద్‌ వాసి

    హైదరాబాద్‌ తార్నాకకు చెందిన మద్దుల వెంకటదాస్‌ అయోధ్య రామయ్య కోసం 8 అడుగుల ముత్యాల గజమాలను తయారుచేశారు. 9 మంది కళాకారులు 9 రోజులు కష్టపడి దీనిని రూపొందించారు. ఈ మాలను చినజీయర్‌స్వామి అయోధ్యకు తీసుకువెళ్లి అలయ నిర్వాహకులకు అందజేస్తారు.

    Pearls Garland

  • 22 Jan 2024 07:41 AM (IST)

    ఈ రాష్ట్రాల్లో నేడు నో మందు.. నో ముక్క..

    ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, గోవా, మహారాష్ట్రతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో సోమవారం ‘డ్రై డే’గా ప్రకటించాయి. అంటే ఈ రాష్ట్రాల్లో మద్యం, మాంసం విక్రయాలు పూర్తిగా బంద్‌.

  • 22 Jan 2024 07:39 AM (IST)

    అయోధ్య రామయ్య ఆలయ విశేషాలు ఇవే

    అయోధ్య రామ మందిరాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆలయంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ తయారు చేశారు. కళ్లకు వస్త్రంతో గంతలు కట్టి ఉన్న విగ్రహం గత శుక్రవారం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలోకి ప్రవేశించే వారు తూర్పు ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుంది. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి తూర్పువైపు నుంచి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆ ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. ఆలయంలో మొత్తం మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.

  • 22 Jan 2024 07:33 AM (IST)

    ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్ట ఏర్పాట్లు

    అయోధ్యలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 51 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. వీటిల్లో దాదాపు 22,825 వాహనాలు నిలిపేందుకు అవకాశం ఉంటుంది.

  • 22 Jan 2024 07:30 AM (IST)

    బాల రాముడికి భారీగా కానుకలు.. ఏమేం వచ్చాయో తెలుసా?

    అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి భారీగా కానుకలు వచ్చాయి. కన్నౌజ్‌ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 క్వింటాళ్ల కుంకుమ, ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు, భోపాల్‌ నుంచి పూలు, చింధ్వారా నుంచి 4.31 కోట్ల రామ నామాల ప్రతి అయోధ్యకు వచ్చాయి. ఇంకా సీతాదేవికి గాజులు, 108 అడుగుల అగర్‌బత్తి, 2100 కిలోల గంట, 1100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం.. ఇలా పలు కానుకలు రామ మందిరానికి బహుమతులుగా వచ్చాయి. నేపాల్‌లోని సీతాదేవి జన్మ స్థలి నుంచి దాదాపు 3 వేల బహుమతులు వచ్చాయి.

  • 22 Jan 2024 07:24 AM (IST)

    పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు

    బాల రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సగం రోజు సెలవు ఇచ్చారు. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సైతం సగం రోజు సెలవు ప్రకటించారు.

  • 22 Jan 2024 07:19 AM (IST)

    అయోధ్య చుట్టూ బహుళ అంచెల్లో భద్రత

    రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం కేంద్రం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇప్పటికే బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను అక్కడ మోహరించింది. వీధి వీధికీ బారికేడ్లను ఏర్పాటు చేసింది. దాడులను ఎదుర్కొనేలా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సైతం మోహరింప చేసింది. ఎవరికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ఎయిమ్స్‌ నుంచీ ప్రత్యేక ఆరోగ్య బృందాలను రప్పించారు.

  • 22 Jan 2024 07:09 AM (IST)

    దేశ, విదేశాల్లో పండగ వాతావరణం

    నేడు అయోధ్యలో కొలువు దీరనున్న రామయ్య. ఈ క్రమంలో దేశ, విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్‌ డీసీ, పారిస్‌ నుంచి సిడ్నీదాకా అనేక ఆలయాల్లో ఓ పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 60 దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.

  • 22 Jan 2024 07:04 AM (IST)

    అయోధ్య రాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక కానుకలు

    అయోధ్య రాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక కానుకలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలు పంపిణీ చేసింది. తెలంగాణలోని సిరిసిల్ల నుంచి సీతమ్మకు కానుకగా బంగారు చీర, 1265 కిలోల హైదరాబాద్‌ లడ్డూ అయోధ్యకు తరలించారు.

  • 22 Jan 2024 06:59 AM (IST)

    దేశవ్యాప్తంగా పండగ వాతావరణం..

    అయోధ్య వేడుకతో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో ఊరూవాడా మార్మోగుతుంది. అయోధ్య ఆలయ అలంకరణకు 1100 టన్నుల పూలను వినియోగించారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిసేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రాణప్రతిష్ఠను కోట్లాది మంది చూసేలా భారీ ఏర్పాట్లు చేశారు. న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వివిధ దేశాల్లోని భారతీయ ఎంబసీల్లోనూ లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీ స్పీచ్‌ ప్రపంచవ్యాప్తంగా లైవ్‌లో ప్రసారం అవుతుంది. పవిత్రోత్సవం తర్వాత ఈ రోజు సాయంత్రం 10లక్షల దీపాలతో రామజ్యోతి కార్యక్రమం జరుగుతుంది.

Follow us on