ఏటీఎమ్‌కు వెళ్లి డబ్బు డ్రా చేసిన వారికి వింత అనుభవం ఎదురైంది. డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన వారు తమ అకౌంట్లో డబ్బులేకపోయినప్పటికీ ఏటీఎమ్ మిషన్ నుంచి అధిక మొత్తంలో డబ్బు పొందారు. సోమవారం (అక్టోబర్ 31) రాత్రి పలువురు వ్యక్తులకు రెండింతలు, మూడింతలుగా డబ్బు నోట్లు అందాయి. ఈ వింత సంఘటన దక్షిణ గోవాలోని బైనాలో ఓ ఏటీఎమ్ సెంటర్లో చోటుచేసుకుంది. తమ ఖాతాలో డబ్బులేనప్పటికీ ఏటీఎం నుంచి దారాపాతంగా డబ్బు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ వార్త చుట్టుపక్కల వ్యాపించడంతో పలువురు ఏటీఎం వద్దకు చేరుకుని డబ్బులు డ్రా చేసుకునేందుకు బారులు తీరారు. ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది.
వెంటనే పోలీసులు అప్రమత్తమై సదరు ఏటీఎం వద్దకు చేరుకుని బ్యాంకు అధికారులను పిలిపించి, ఏటీఎమ్‌ను మూసివేయించారు. ఐతే ఏటీఎం మిషన్‌లో లోపం ఏ కారణం చేత తలెత్తిందనే విషయం ఇంకా తెలియరాలేదు. అప్పటికే డబ్బు డ్రా చేసిన స్థానికులు తమ వద్ద నుంచి పోలీసులు ఎక్కడ డబ్బు తిరిగి తీసుకుంటారోనని భయభ్రాంతులకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందించిన వ్యక్తి మీడియాకు తెలిపాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.