Assam floods: జల విలయంతో కకావికలం అవుతున్న అస్సాం.. నిరాశ్రయులైన లక్షలాది మంది..

|

May 22, 2022 | 7:53 AM

Assam floods: జల విలయం అస్సాంను కకావికలం చేసింది. అస్సామీలను అష్టకష్టాల పాలు చేశాయి భీకర వరదలు. వేలాది మంది గూడు చెదిరి కూడు

Assam floods: జల విలయంతో కకావికలం అవుతున్న అస్సాం.. నిరాశ్రయులైన లక్షలాది మంది..
Assam Floods
Follow us on

Assam floods: జల విలయం అస్సాంను కకావికలం చేసింది. అస్సామీలను అష్టకష్టాల పాలు చేశాయి భీకర వరదలు. వేలాది మంది గూడు చెదిరి కూడు లేక అలమటిస్తున్నారు. నగావ్‌, హోజాయీ, కాచార్‌, దరంగ్‌ జిల్లాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొన్నిచోట్ల వందలాది కుటుంబాలు రైలు పట్టాలపై బతుకీడుస్తున్నాయి.

అస్సాంలో 29 జిల్లాల్లో దాదాపు 8 లక్షల మంది వరద విలయానికి నానా కష్టాలు పడుతున్నారు. నగావ్‌ జిల్లాలో చంగ్‌జురాయ్‌, పటియా పత్తర్‌ అనే గ్రామాల్లో 500 కుటుంబాలు రైలు పట్టాలపై బతుకీడుస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు గ్రామాలను వరద ముంచేసింది. నీట మునగని చోటు ఏదైనా ఉందంటే అది ఎత్తయిన ప్రదేశంలో ఉన్న రైల్వే ట్రాక్‌ ఒక్కటే. దాంతో ఆ గ్రామాల ప్రజలు రైలు పట్టాలపై వానకు తడుస్తూ, చలికి వణుకుతూ గడుపుతున్నారు.

ఒక్క నగావ్‌ జిల్లాలోనే మూడున్నర లక్షల మందిని వరదలు ప్రభావితం చేశాయి. వేర్వేరుచోట్ల ఇద్దరు పిల్లలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అస్సాం వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 14కు పెరిగింది. 2,251 గ్రామాలు ఇప్పటికీ వరద నీటి ముట్టడిలో ఉన్నాయి. ఈ జల విలయంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.

వరదలు, కొండ చరియలు విరిగిపడటం, రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. రవాణ వ్యవస్థను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన కేంద్రం గువాహటి – సిల్చర్‌ మధ్య ఎమర్జెన్సీ ఫ్లైట్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. ఒక్కో టికెట్‌కు 3 వేల రూపాయలు చార్జీగా నిర్ణయించింది. ఇది వరద బాధిత కుటుంబాలకు సాయపడుతుందని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఆర్మీ, పారామిలిటరీ, డిజాస్టర్‌ రిలీఫ్‌ దళాలు సహాయ చర్యలు చేపడతున్నాయి. వేలాది మంది వరద బాధతులు పునరావాస శిబిరాల్లో గడుపుతున్నారు. అస్సాం కుదుటపడేందుకు చాలా రోజులే పడుతుంది.