Arvind Kejriwal: ఈడీ సమన్లు బేఖాతరు.. కేజ్రీవాల్ ఎందుకిలా చేశారు?
ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంలో పలువురు అధికారులే కాదు, అధికార పార్టీకి చెందిన నేతలు కూడా అరెస్టయ్యారు. వారిలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీశ్ సిసోడియా, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ విభాగం హెడ్ విజయ్ నాయర్ ముఖ్యులు.

దర్యాప్తు సంస్థ విచారణకు పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏమౌవుతుంది? మరోసారి విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ అవుతాయి. అయినా సరే వెళ్లకపోతే నేరుగా దర్యాప్తు సంస్థ అధికారులు వచ్చి అరెస్టు చేయడానికి ఆస్కారం ఇచ్చినట్టవుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకొచ్చింది అంటే.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) జారీ చేసిన సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. అంతేకాదు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. సాధారణంగా ఏ దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసినా వాటిని గౌరవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తేదీన హాజరవడం కుదరకపోతే కారణాలను పేర్కొంటూ ఆ సంస్థకు లేఖ రాయవచ్చు. మనకు వీలైన తేదీని సూచించవచ్చు. అయితే దర్యాప్తు సంస్థ సమన్లకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదిస్తూ ఎదురుదాడి తరహాలో బదులిస్తే.. వాటిని దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకోదు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో ఇదే జరుగుతోంది.
ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వంలో పలువురు అధికారులే కాదు, అధికార పార్టీకి చెందిన నేతలు కూడా అరెస్టయ్యారు. వారిలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీశ్ సిసోడియా, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ విభాగం హెడ్ విజయ్ నాయర్ ముఖ్యులు. ఢిల్లీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వరకు విస్తరించిన ఈ కుంభకోణంలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు కూడా అరెస్టయ్యాయి. క్లుప్తంగా చెప్పాలంటే అప్పటి వరకు ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాలు, రిటైల్ విక్రయాలను ఇతర రాష్ట్రాల మాదిరిగా బిడ్డింగ్ ఆహ్వానించి అప్పగించే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీ రూపకల్పన సమయంలోనే కొంతమంది మద్యం వ్యాపారులతో కలిసి కుమ్మక్కై, వారికి అనుకూలమైన నిబంధనలు చేర్చి, అనుకూలంగా లేనివాటిని తొలగించారన్నది ఒక అభియోగం. మార్చిన నిబంధనలు, కమిషన్ రేట్ల ద్వారా మద్యం వ్యాపారులకు కలిగే ప్రయోజనం నుంచి వాటాలు (ముడుపులు) ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుందని, ఆ సొమ్మును గోవా సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఖర్చు చేసిందనేది మరో అభియోగం. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన కుట్ర, అవినీతి తదితర అంశాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తుండగా… ఇందులో చోటుచేసుకున్న మనీలాండరింగ్ అంశాలపై ED దర్యాప్తు చేస్తోంది.
విచారణలో భాగంగా రెండు దర్యాప్తు సంస్థలు అనేక మందిని ప్రశ్నించాయి. కొందరిని అరెస్టు చేసి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నాయి. అలాగే అనేక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను సేకరించాయి. అంతిమంగా ఈ మొత్తం వ్యవహారంలో డిప్యూటీ సీఎం సిసోడియా మాత్రమే కాదు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ హస్తం కూడా ఉందని గుర్తించాయి. కేజ్రీవాల్ నివాసంలో ఒకట్రెండు పర్యాయాలు సమావేశాలు జరిగాయని, ఐఫోన్ ఫేస్‌టైమ్ కాల్ ద్వారా నేరుగా కేజ్రీవాల్ మాట్లాడారని కూడా దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జిషీట్లలో పేర్కొన్నాయి. ‘తన మనిషి’గా విజయ్ నాయర్ వ్యవహరిస్తారని కేజ్రీవాల్ స్వయంగా చెప్పినట్టు వెల్లడించాయి. ఆ మేరకు సీబీఐ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఓ రెండు పర్యాయాలు కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచి ప్రశ్నించింది. ఇప్పుడు తాజాగా ఈడీ కూడా సమన్లు జారీ చేసి నవంబర్ 2న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
మనీలాండరింగ్ చట్టం ప్రకారం సమన్లు
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) – 2002లోని సెక్షన్ 50 ప్రకారం ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. ఈ సెక్షన్ ప్రకారం జారీ చేసిన సమన్ల ప్రకారం సదరు వ్యక్తి నేరుగా హాజరవ్వాలి. లేదంటే తన తరఫున ఒక ప్రతినిధినినైనా పంపవచ్చు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. అలాగే అడిగిన పత్రాలు, రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది. కేజ్రీవాల్ అసలు విచారణకే హాజరుకాకపోగా, దర్యాప్తు సంస్థకు ఇచ్చిన సమాధానంలో సమన్లపై రాజకీయ విమర్శలు చేశారు తప్ప సహేతుకమైన కారణాలను చూపలేదు. ఈ సమన్లు చట్ట విరుద్ధమని, ఓ రాజకీయ పార్టీ ప్రేరేపితమని విమర్శించారు. ఈ జవాబును ఈడీ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. ఈ క్రమంలో మరోసారి సమన్లను జారీ చేసేందుకు ఈడీ అధికారులు సమాయత్తమవుతున్నారని తెలిసింది. కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యేవరకు సమన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. ఎంతకూ ఆయన హాజరుకాకపోతే.. ఈడీ ముందు రెండు అవకాశాలుంటాయి. అందులో..
01. కేసు ట్రయల్ జరుగుతున్న కోర్టుకు వెళ్లి కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని చెబుతూ నాన్-బెయిలబుల్ వారంట్ తీసుకోవడం
02. కేజ్రీవాల్ నివాసానికే ఈడీ అధికారుల బృందం వెళ్లి ప్రశ్నించి, తగిన సాక్ష్యాధారాలు ఉంటే అరెస్టు చేయడం
ఈడీ ఈ రెండు ఆప్షన్లలో దేన్నైనా ఉపయోగించుకోవచ్చు. అయితే కేజ్రీవాల్ ఇంతదాకా లాగుతారా లేక తదుపరి సమన్లను గౌరవిస్తూ విచారణకు హాజరవుతారా అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. తనను లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ ఎంపీ మనీశ్ తివారీ చెప్పిన రోజే సమన్లు వచ్చాయి కాబట్టి ఇవి రాజకీయ దురుద్దేశాలతో కూడిన సమన్లు అని కేజ్రీవాల్ అంటున్నారు. ఈ సమన్ల జారీని రాజకీయ కక్షసాధింపు చర్యగా చెబుతూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఒకవేళ నిజంగానే అరెస్టయినా సరే.. దాని ద్వారా తన పార్టీ మైలేజ్ పొందాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..