
భారత్‌కి చెందిన సొహైల్ అనే వ్యక్తి ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీలో ఉన్న వ్యాలీ ఫెయిర్ మాల్‌లో ఓ ఆభరణాల సంస్థకు చెందిన కియోస్క్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం విధుల్లో ఉండగా 48 ఏళ్ల పీటర్ మైకేల్ లార్సన్ అనే వ్యక్తి అతని వద్దకు వచ్చి ముందుగా తాగునీటి బాటిల్ కోరాడు. సొహైల్ నీటి బాటిల్ తీసుకురావడానికి తిరిగిన సమయంలో లార్సన్ అతనిపై అకస్మాత్తుగా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. దాడికి ముందు సొహైల్‌ను అతని పేరు, స్వస్థలం, మతం గురించి ప్రశ్నించినట్లు బాధితుడి సహచరులు వెల్లడించారు. సొహైల్ సహోద్యోగి లూనా నునెజ్ తెలిపిన వివరాల ప్రకారం..
ముందుగా ‘నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?’ అని అడగగా సొహైల్ తాను భారత్‌కి చెందినవాడినని, తన పేరు సొహైల్ అని చెప్పాడు. అనంతరం ‘నువ్వు ముస్లింవా?’ అని ప్రశ్నించగా.. అవునని సమాధానం ఇచ్చాడు. అనంతరం లార్సన్ కత్తితో దాడి చేసినట్లు సొహైల్ ఆస్పత్రిలో తనకు వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. దాడిలో సొహైల్ శరీరంపై సుమారు 15 కత్తిపోట్లు పడినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు పీటర్ మైకేల్ లార్సన్‌ను పోలీసులు అరెస్టు చేసి సాల్ట్ లేక్ కౌంటీ జైలుకు తరలించారు. హత్యాయత్నం, ప్రమాదకర ఆయుధ వినియోగానికి సంబంధించిన అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే దాడికి గల ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా సొహైల్ పనిచేస్తున్న ఆభరణాల కియోస్క్ యజమాని అద్నాన్ మహ్మద్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సొహైల్ ఇద్దరు పిల్లల తండ్రి. తన కుటుంబాన్ని పోషించేందుకు ప్రతిరోజులాగే ఈ రోజు కూడా పనికి వచ్చాడు. నేను అక్కడ ఉండి ఉంటే అతడిని కాపాడేందుకు నా ప్రాణాలైనా అర్పించేవాడినని అన్నారు. సొహైల్ ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వారి సాహసం వల్లే మానవత్వం ఇంకా జీవించి ఉందని పేర్కొన్నారు. ద్వేషానికి సమాజంలో స్థానం లేదని, మానవత్వమే అందరికంటే గొప్ప మతమని ఆయన వ్యాఖ్యానించారు. సొహైల్ కోలుకునే వరకు వైద్య ఖర్చులు, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు అతని స్నేహితురాలు లూనా నునెజ్ ఆన్‌లైన్‌లో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.