Amit Shah: ముఖ్యమంత్రి మార్పు లేనట్టేనా? అమిత్‌షా పర్యటన వేళ కర్నాటకలో హైడ్రామా!

కర్నాటకలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. బసవేశ్వరుడి జయంతి రోజు బస్వరాజ్‌ బొమ్మై సీఎం కుర్చీ లాగేస్తారనే ప్రచారం జోరుగా సాగింది.

Amit Shah: ముఖ్యమంత్రి మార్పు లేనట్టేనా? అమిత్‌షా పర్యటన వేళ కర్నాటకలో హైడ్రామా!
Amit Shah Baswaraj Bommai

Updated on: May 04, 2022 | 8:46 AM

Amit Shah Karnataka Visit: కర్నాటకలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. బసవేశ్వరుడి జయంతి రోజు బస్వరాజ్‌ బొమ్మై సీఎం కుర్చీ లాగేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అబ్బే అలాంటిదేం లేదంటున్నారు బీజేపీ నేతలు. అమిత్‌షా పర్యటన వేళ కర్నాటకలో హైడ్రామా కొనసాగింది. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా సీఎం బస్వరాజ్‌ బొమ్మైని మార్చే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు అప్పుడే సీఎంని మార్చే ఉద్దేశం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు పరిచిన సీఎం బొమ్మైని అమిత్‌షా అభినందించడం కొసమెరుపు.

కర్నాటకలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం బెంగళూర్‌ వచ్చారు అమిత్‌షా. మొదట బసవేశ్వరుడి 889వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించారు. ఆ తర్వాత బెంగళూరులో నృపతుంగ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి. భారత సైన్యం ఇప్పుడు ఎంత బలంగా ఉందో చాటి చెప్పారు. గతంలో అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాల సరిహద్దుల దగ్గర ఆ దేశ సైన్యం పటిష్టంగా ఉండేదని, శత్రు దేశాలు ఈ రెండు దేశాల బోర్డర్‌లోకి ప్రవేశించాలంటే భయపడేవని చెప్పుకొచ్చారు. అలాంటి పటిష్టమైన సైన్యం ఇప్పుడు భారత్‌ సొంతమని చెప్పారు అమిత్‌షా. దీంతో అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాల సరసర ఇప్పుడు భారత్‌ కూడా చేరిందన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు అమిత్‌షా. భారత సరిహద్దు వైపు తొంగి చూస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి.

మరోవైపు కర్నాటకలో సీఎంను మార్చేస్తారనే ఊహాగానాలకు కూడా చెక్‌ పడింది. ఒకవైపు నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా కర్నాటక నిలిచిందని సీఎం బస్వరాజ్‌ బొమ్మైని స్వయంగా అమిత్‌షా ప్రశంసలతో ముంచెత్తడంతో ముఖ్యమంత్రి మార్పు ప్రచారానికి తెరపడింది. అంతేకాదు బొమ్మైని మార్చే ప్రసక్తే లేదని మాజీ సీఎం యడ్యూరప్ప కూడా తేల్చి చెప్పారు.

Read Also…. Weather Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. అకాల వర్షానికి అన్నదాత విలవిల.. నేడు, రేపు భారీ వర్షాలు